‘కాంతారా’ సినిమా దర్శకుడు, హీరో రిషబ్ శెట్టి గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. ఈ సినిమాలో నటించిన తారలు కూడా మనవాళ్లకు పరిచయం లేదు. సినిమా స్టోరీ కూడా పూర్తిగా కన్నడ నేటివిటీతో సాగేది. దాని గురించి కూడా మనవాళ్లకు ఐడియా లేదు. అయినప్పటికీ.. ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు మన ప్రేక్షకులు. కన్నడ వెర్షన్ చూడడానికి మన వాళ్లు చూపించిన ఆసక్తి చూసి వెంటనే ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు.
శనివారం నాడు విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం రేపుతోంది. మన స్టార్ హీరోలు నటించిన రేంజ్ లో ఈ సినిమా దూసుకుపోతుంది. శని, ఆదివారాల్లో సింగిల్ స్క్రీన్స్ లో కూడా ఈ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అయింది. ఈ సినిమాకి వస్తోన్న క్రేజ్ చూసి ఆదివారం స్క్రీన్లు, షోలు పెంచాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ చూసి కన్నడ ట్రేడ్ పండితులు కూడా ఆశ్చర్యపోతున్నారు.
కర్ణాటకలో గత నెల 30న విడుదలైన ‘కాంతారా’ తొలిరోజు రూ.2.5 కోట్లు వసూళ్లు రాబట్టింది. కన్నడ సినిమా స్థాయికి అక్కడ ఇన్ని కోట్లంటే మంచి కలెక్షన్స్ అనే చెప్పాలి. అయితే ఈ సినిమా తెలుగులో తొలిరోజు రూ.4.5 కోట్ల గ్రాస్ వసూలు చేయడం విశేషం. ఒక కన్నడ సినిమా అక్కడి కంటే.. డబ్బింగ్ వెర్షన్ ద్వారా తెలుగులో ఎక్కువ వసూళ్లు రాబట్టడం విశేషం.
ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ‘కేజీఎఫ్’ సినిమా కూడా తెలుగులో ఇలానే సంచలనం సృష్టించింది. కానీ ఆ సినిమా జోనర్, టేకింగ్ వేరు. ‘కాంతారా’ సినిమా ఇలాంటి ఘనత సాధించడం మాత్రం గొప్పగా చెప్పుకుంటున్నారు. రెండు రోజుల్లో తెలుగులో ఈ సినిమా రూ.10 కోట్ల మార్క్ ను టచ్ చేసింది. లాంగ్ రన్ లో ఇంకెన్ని కలెక్షన్స్ సాధిస్తుందో చూడాలి!