మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ‘మనమంతా’ ‘జనతా గ్యారేజ్’ ‘మన్యం పులి’ ‘లూసిఫర్’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. అయితే ఈ మధ్య మోహన్ లాల్ నుండి ఆసక్తికర సినిమాలు రాకపోవడంతో కాస్త వెనుకబడ్డారు అనే చెప్పాలి. అయినా సరే పెద్ద సినిమాల కోసం ఏదో ఒక రకంగా మోహన్ లాల్ ను సంప్రదిస్తూనే ఉన్నారు అనే టాక్ ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంది.
62 ఏళ్ల వయసులో కూడా మోహన్ లాల్ ప్రజెంట్ జనరేషన్ స్టార్ హీరోలకు గట్టిపోటీ ఇస్తున్నారు. ఇంతటి చరిత్ర ఉన్న మోహన్ లాల్ కి కొన్నాళ్లుగా ఓ కేసు తలనొప్పిగా మారిందట. దీంతో ఆయన తర్జనభర్జన పడుతున్నట్టు వినికిడి. విషయం ఏంటంటే… కొన్నాళ్ల క్రితం మోహన్ లాల్ ఇంట్లో ఐటీ సోదాలు జరిగాయి. ఆ సమయంలో రెండు ఏనుగు దంతాలు వారి కంట పడ్డాయి. దీంతో ఆయన పై వన్యప్రాణుల చట్టం ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.
ఏనుగు దంతాలను ఇంట్లో అక్రమంగా అలంకరణకు పెట్టుకొని చట్టాన్ని ఉల్లంఘించారని మోహన్ లాల్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విషయంపై మోహన్ లాల్ కోర్టులో వివరణ ఇవ్వడం జరిగింది. కానీ హైకోర్టు మోహన్ లాల్ వేసిన పిటిషన్ ను మరోసారి కొట్టేసి షాకిచ్చింది. మోహన్ లాల్ ఈ కేసు విషయమై ఇంకా ఇబ్బందులు పడటం అనేది అభిమానులను సైతం కంగారు పెడుతున్నట్టు తెలుస్తుంది.