సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య ఎంత మాత్రం తగ్గడం లేదు. ఈ ఏడాది ఎంతో మంది సినీ సెలబ్రిటీలు మరణించారు. అందులో కోటా శ్రీనివాసరావు, దర్శకుడు ఏ.ఎస్.రవికుమార్ చౌదరి వంటి ఎంతో మంది స్టార్స్ ఉన్నారు. కొందరు అనారోగ్య సమస్యలతో ఇంకొంతమంది ప్రమాదవశాత్తు ఇలా ఎవరొకరు మృత్యువాత చెందారని చెప్పవచ్చు. తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు పక్క రాష్ట్రాల్లోని సినీ ప్రముఖులు కూడా మరణించడం జరిగింది. తాజాగా ఓ కన్నడ నటుడు మృతి చెందినట్టు స్పష్టమవుతుంది.
వివరాల్లోకి వెళితే.. కేజీఎఫ్ నటుడు హరీష్ రాయ్ మృతి చెందారు. కొంతకాలంగా క్యాన్సర్ తో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వస్తున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఈరోజు కన్నుమూసినట్టు సమాచారం. కె.జి.ఎఫ్ చాప్టర్ 1, కె.జి.ఎఫ్ చాప్టర్ 2 సినిమాల్లో చాచా అనే ముస్లిం పాత్రలో ఆయన కనిపిస్తారు. రాకీ భాయ్ కి అనుచరుడిగా, అత్యంత కీలకమైన సపోర్టింగ్ రోల్ పోషించారు హరీష్ రాయ్. 2వ పార్ట్ రిలీజ్ అయ్యే టైంకే ఆయనకు క్యాన్సర్ సోకిందట. అది అప్పటికే 4వ స్టేజికి చేరిందట. ఈ క్రమంలో అతని వద్ద డబ్బులు లేకపోవడంతో ఆర్థిక సాయం కోరుతూ అక్కడి సినీ పెద్దలను సంప్రదించారట.

దీంతో హీరో ధృవ్ సార్జా స్పందించి తగిన ఆర్థిక సాయం అందించినట్టు వార్తలు వచ్చాయి. అయితే పరిస్థితి విషమించడంతో ఇప్పుడు కన్నుమూసినట్టు స్పష్టమవుతుంది. క్యాన్సర్ సోకిన 3 ఏళ్లకు హరీష్ రాయ్ మరణించారు. ఉపేంద్ర దర్శకత్వంలో వచ్చిన ‘ఓం’ సినిమాతో హరీష్ రాయ్ నటుడిగా మారారు. ఆ తర్వాత ‘డాన్’ ‘దండుపాళ్య’ ‘బెంగళూరు అండర్ వరల్డ్’ ‘సింహ రూపిణి’ వంటి సినిమాల్లో ఆయన నటించారు.
