‘రిపబ్లిక్’ సినిమా చూశారా? అందులో హీరో ప్రజా సమస్యలపై పోరాడే కలెక్టర్‌గా పని చేస్తాడు. ఈ క్రమంలో ‘కొల్లేరు’ ప్రాంతం గురించి ఆ సినిమాలో ప్రస్తావించారు. దీంతో ఆ సినిమాలోని సన్నివేశాలు తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని… ఆ గ్రామ సంఘ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలో పెద్ద ఎత్తున నిరసన తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు. అంతే కాదు ఆ సన్నివేశాలు తొలగించకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. సాయిధరమ్ తేజ్, ఐశ్వర్య రాజేష్ నాయకానాయికలుతగా దేవా కట్టా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రిపబ్లిక్’.
ఈ సినిమాలో చెరువులను, చేపలను విషతుల్యం చేస్తున్నారంటూ… సన్నివేశాలు ఉన్నాయని, అలా మా గ్రామాలపై దుష్ప్రచారం చేస్తున్నారని కొల్లేరు నాయకులు అంటున్నారు. మా మనోభావాలు దెబ్బతిసే విధంగా దర్శకుడు దేవా కట్టా ఈ సినిమాను చిత్రీకరించారని వారు ఆరోపిస్తున్నారు. ‘రిపబ్లిక్’సినిమా ఆపివేయలని జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, కలెక్టర్ కార్తికేయ మిశ్రాకి కొల్లేరు గ్రామ వాసులు వినతి పత్రం అందజేశారు. ఈ నేపథ్యంలో ఏలూరు కలెక్టరేట్‌కు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
కొల్లేరు సరస్సు విషయంలో రాజకీయ పార్టీలకు సంబంధం లేదని, కొల్లేరును తప్పుగా చిత్రీకరిస్తే మరోసారి నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ఆ సన్నివేశాల్ని తొలగించకపోతే సినిమాపై సుప్రీం కోర్టుకు వెళ్తామని గ్రామ ప్రజలు హెచ్చరించారు.