కొన్ని హీరో – డైరక్టర్ కాంబినేషన్‌ల గురించి డిస్కస్ చేసేటప్పుడే కాదు. ఆలోచన వచ్చినప్పుడు కూడా గూస్‌బంప్స్ వచ్చేస్తుంటాయి. ఎందుకంటే వాళ్లిద్దరూ ఆయా రంగాల్లో టాప్‌లో ఉంటారు కాబట్టి. అయితే ఆ ఇద్దరిలో ఒకరు ఆల్‌రౌండర్ అయితే ఇక ఆ ఫీలింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇలాంటి కాంబినేషన్‌లు ఇప్పటివరకు తెలుగులో అయితే రాలేదు అనే చెప్పాలి. మలయాళంలో ‘లూసిఫర్’, ‘ఎల్ 2’ (L2: Empuraan) , ‘బ్రో డాడీ’ రూపంలో మూడుసార్లు వచ్చింది. మూడు సార్లూ బ్లాక్‌బస్టరే. ఒకరు హీరో, మరొకరు డైరక్టర్ కమ్ హీరో.
ఇప్పుడు సౌత్ సినిమాలో ఇలాంటి కాంబినేషన్ ఇంకొకటి సెట్ అవ్వబోతోందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ – కోలీవుడ్ వర్గాలు. అదేంటి తెలుగు, తమిళ సినిమా పరిశ్రమను కలిపేసి కాంబినేషన్ అంటున్నారు అనుకుంటున్నారా? అవును.. ఇక్కడ హీరో తెలుగు సినిమా నుండి, డైరక్టర్ తమిళ సినిమా నుండి కాబట్టి. క్లియర్‌గా చెప్పాలంటే రామ్‌చరణ్ (Ram Charan) , ధనుష్(Dhanush) కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయట. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే త్వరలో అనౌన్స్‌మెంట్ వస్తుంది అంటున్నారు.
ఓవైపు హీరోగా, మరోవైపు దర్శకుడిగా వరుస విజయాలు అందుకుంటున్న ధనుష్.. ఇటీవల రామ్‌చరణ్‌ను కలిశారు అని సమాచారం. ఈ మీటింగ్‌లో చరణ్‌కు ఓ సినిమా పాయింట్ చెప్పారని, ఆసక్తికరంగా ఉండటంతో పూర్తి స్థాయి కథను సిద్ధం చేసే పనిలో ప్రస్తుతం ధనుష్ ఉన్నారు అని అంటున్నారు. ఈ కాంబినేషన్ సెట్ అయితే, టాలీవుడ్, కోలీవుడ్‌లో సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం అని చెప్పొచ్చు. మరి ధనుష్‌తో చరణ్ సినిమా చేస్తాడా.. చేస్తే ఎలాంటి కథతో వస్తాడు అనేది చూడాలి.
ఇక ప్రస్తుతం చరణ్.. బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వంలో ‘పెద్ది’ (Peddi) అనే సినిమా చేస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. ఇందులో చరణ్ ఆట కూలీగా కనిపిస్తాడట. అందుకే డబ్బులిస్తే ఏ ఆటైనా ఆడేస్తాడన్నమాట.