టాలీవుడ్ లో యంగ్ హీరోగా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు సందీప్ కిషన్. ‘ప్రస్థానం’ సినిమాలో తన విలనీ పెర్ఫార్మన్స్ తో అందరికీ షాకిచ్చారు. ఆ తరువాత హీరోగా వరుస హిట్లు అందుకున్నారు. కానీ ఈ మధ్యకాలంలో సందీప్ కి సరైన సినిమా ఒక్కటి కూడా పడలేదు. రకరకాల జానర్లలో సినిమాలు తీసినా.. వర్కవుట్ కాలేదు. ‘టైగర్’, ‘నిను వీడని నీడను నేనే’ ఇలాంటి సినిమాలు సేఫ్ వెంచర్లు అయినప్పటికీ.. హిట్ కాలేకపోయాయి.
దీంతో టాలీవుడ్ లో అతడికి ఆఫర్లు బాగా తగ్గాయి. అతడి మార్కెట్ పూర్తి దెబ్బతింది. అయితే తమిళంలో మాత్రం సందీప్ కిషన్ కి మంచి సినిమాలు పడ్డాయి. ‘విక్రమ్’ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తొలి సినిమా ‘మానగరం’లో సందీప్ కిషన్ ను హీరోగా తీసుకున్నారు. ఆ సినిమాతో పాటు ‘మాయవన్’, ‘కసడ తబరా’ లాంటి సినిమాలు కూడా మంచి విజయాలను అందుకున్నాయి. నటుడిగా సందీప్ కి మంచి పేరు తీసుకొచ్చాయి.
ఇప్పుడు కోలీవుడ్ లో ‘మైఖేల్’ అనే భారీ బడ్జెట్ సినిమా చేశారు సందీప్ కిషన్. ఈ సినిమాకి సంబంధించిన ప్రోమోలు చూసి జనాలు ఏదో విషయముందనే అనుకున్నారు. ఈ సినిమాతో సందీప్ కిషన్ కెరీర్ మలుపు తిరుగుతుందనుకున్నారు. కానీ అలా జరగలేదు. ‘కేజీఎఫ్’ సినిమాను అనుకరించబోయి బోల్తా కొట్టింది ఈ సినిమా. సినిమాపై హైప్ ను తీసుకురాగలిగారు కానీ కంటెంట్ తో ఆకట్టుకోలేకపోయారు.
అటు ప్రేక్షకులకు, ఇటు విమర్శకులకు సినిమా నచ్చలేదు. సందీప్ గత సినిమాల ప్రభావంతో ఈ సినిమాకి సరైన ఓపెనింగ్స్ కూడా రాలేదు. టాక్ బాలేకపోవడంతో సినిమా ఏ దశలోనూ పైకి లేవలేదు. తెలుగులో దాదాపుగా ఈ సినిమా పనైపోయింది. కనీసం తమిళంలోనైనా ఈ సినిమా వర్కవుట్ అవుతుందేమోనని చూశారు. కానీ తమిళ ప్రేక్షకులు కూడా సందీప్ ను లైట్ తీసుకున్నారు. అక్కడ ఈ సినిమాకి కనీసపు కలెక్షన్స్ కూడా రాలేదు.