కమర్షియల్ సినిమాకు మెసేజ్ హంగులు అద్ది సినిమాలు తీయడంలో దిట్ట అనిపించుకున్నారు కొరటాల శివ. ఇప్పటివరకు ఆయన దర్శకుడిగా రూపొందిన సినిమాలన్నీ ఇదే కోవలో ఉంటాయి. ఇప్పుడు చేస్తున్న ‘ఆచార్య’ విషయంలోనూ అంతే అంటున్నారు. అంతేకాదు త్వరలో చేయబోతున్న అల్లు అర్జున్ సినిమా కూడా ఇదే పంథాను ఫాలో అవుతున్నారట. కొరటాల – బాలకృష్ణ కాంబోలో సినిమా ఉంటుందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది.
కొరటాల శివ లైనప్ భలే బిజీగా మారుతోంది. ‘ఆచార్య’ పనులు అన్నీ ముగించుకొని ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్ సినిమా కథ పనిలో పడ్డారు. మరోవైపు ప్రీ ప్రొడక్షన్ పనులు కూడ చూసుకుంటున్నారు. హైదరాబాద్‌లో రూపొందించిన ఓ సెట్‌లో త్వరలో చిత్రీకరణ మొదలవుతుందని సమాచారం. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో కూడా కొరటాల ఇదే మాట చెప్పారు. ఈ సినిమా తర్వాత ముందుగా అనుకున్నట్లు అల్లు అర్జున్‌తో సినిమా ఉంటుంది. ఆ తర్వాతనే బాలయ్య సినిమా ప్రారంభం అని సమాచారం.
అయితే ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. దీనికి సంబంధించి ఇప్పటికే బాలయ్యకు కొరటాల సినిమా లైన్ వినిపించారని సమాచారం. కాస్త రాజకీయం టచ్ ఉండి, ఓ ప్రాంతం పెద్ద కథతో ఈ సినిమా కథ ఉంటుందట. ఈ పాయింట్ నచ్చడంతో బాలయ్య ఓకే చెప్పారని, దీన్ని పూర్తి కథగా సిద్ధం చేసుకోవడానికి కొరటాల ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. కొరటాల సినిమా అంటే అందులో సందేశం పక్కాగా ఉంటుంది. మరి ఈ సినిమాలో ఏముంది అనేది చూడాలి.
బాలకృష్ణ ప్రస్తుతం ఎంచుకుంటున్న కథల్లో అంతర్లీనంగా రాజకీయం ఆలోచనలు కనిపిస్తున్నాయి. ఓ పార్టీ వారిని, వారి వైఫల్యాలను ఎత్తిచూసేలా డైలాగ్‌లు ఉంటాయి. మొన్నీ మధ్య వచ్చిన ‘అఖండ’లో కొన్ని ఇలాంటి సంభాషణలు చూడొచ్చు. త్వరలో మొదలవబోతున్న గోపీచంద్ మలినేని సినిమాలోనూ అలాంటి డైలాగ్స్ ఉంటాయంటున్నారు. ఆ లెక్కన ఆ తర్వాతే చేసే అనిల్ రావిపూడి సినిమాలోనూ ఉంటాయి. ఆ తర్వాత చేస్తారంటున్న కొరటాల సినిమాలో పక్కా.