గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రులుగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు, వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి.. మొదట కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మంచి స్నేహితులని అందరికీ తెలిసిన సంగతే. అయితే తరువాత రాజకీయ ప్రత్యర్థులుగా మారారు. ఇదిలా ఉండగా ఇటీవల వచ్చిన ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ చిత్రంలో వై.ఎస్.ఆర్ పాత్రను పోషించాడు శ్రీ తేజ్. అంతేకాదు ఈ చిత్రంలో ‘వై.ఎస్.ఆర్’ గా అచ్చు గుద్దినట్టు దిగిపోయాడు. అంతలా క్రిష్ శ్రీ తేజ్ ను వై.ఎస్.ఆర్ గా మార్చేశాడు. బాడీ లాంగ్వేజ్ లోనూ.., నటన లోనూ కూడా వై.ఎస్.ఆర్ పాత్రని అద్భుతంగా పోషించాడు.
అలా క్రిష్ కి శ్రీతేజ్ లో వై.ఎస్.ఆర్ కనిపిస్తే… మన రాంగోపాల్ వర్మకి మాత్రం నారా చంద్రబాబు నాయుడు కనిపించినట్టు ఉన్నాడు.విచిత్రం ఏమిటంటే… చంద్రబాబు గెటప్ లో శ్రీ తేజ్ మరింత బాగా కుదిరాడు. హైట్.. దగ్గర్నుండీ.. గడ్డంతో సహా అచ్చం చంద్రబాబు లాగే కనిపిస్తున్నాడు. వివరాల్లోకి వెళితే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంలో శ్రీతేజ్ చంద్రబాబు నాయుడు పాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రం మొత్తం చంద్రబాబు పై సెటైరికల్ గా దర్శకుడు వర్మ చిత్రీకరించినట్టు.. ట్రైలర్ చూస్తే స్పష్టమవుతుంది.
మరి ఈ పాత్రలో శ్రీతేజ్ నటన ఎలా ఉంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి. ఏదేమైనప్పటికీ ముఖ్య పాత్ర కాబట్టి శ్రీ తేజ్ కి మంచి గుర్తింపు వచ్చే ఛాన్స్ ఉంది. దీంతో శ్రీ తేజ్ కు మరిన్ని అవకాశాలు కూడా క్యూ కడతాయనడంలో సందేహం లేదు. గతంలో ‘వంగవీటి’ చిత్రంలో శ్రీతేజ్.. దేవినేని నెహ్రూ పాత్ర పోషించాడు. ‘టచ్ చేసి చూడు’, ‘ఆటగాళ్ళు’ వంటి చిత్రాల్లో కూడా శ్రీ తేజ్ నటించినా.. రాని గుర్తింపు ఇలా వై.ఎస్.ఆర్,చంద్రబాబు పాత్రలతో తెచ్చుకున్నాడు ఈ యువ నటుడు.