ప్రముఖ టాలీవుడ్ నటుడు కృష్ణంరాజు మరణవార్త టాలీవుడ్ సినీ ప్రముఖులను, రాజకీయ ప్రముఖులను ఎంతగానో బాధ పెట్టిందనే సంగతి తెలిసిందే. తెలంగాణ సర్కార్ అధికారిక లాంఛనాలతో ఈరోజు కృష్ణంరాజు అంత్యక్రియలను నిర్వహించనుంది. మెయినాబాద్ వద్ద ఉన్న ఫామ్ హౌస్ లో అంత్యక్రియలను నిర్వహించనున్నారని తెలుస్తోంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం ప్రభాస్ సోదరుడు ప్రభోద్ చేతుల మీదుగా అంత్యక్రియలు జరగనున్నాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులను మాత్రమే అంత్యక్రియలకు అనుమతించనున్నారని తెలుస్తోంది.
కృష్ణంరాజు తన సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించడంతో పాటు ఆ సినిమాల ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. కృష్ణంరాజు 56 సంవత్సరాలకు పైగా సినిమా ఇండస్ట్రీలో కెరీర్ ను కొనసాగించారు. కృష్ణంరాజు తన సినీ కెరీర్ లో ఎన్నో గొప్ప సినిమాలలో నటించి ప్రశంసలు అందుకున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను కొనసాగించి భిన్నమైన పాత్రల ద్వారా కృష్ణంరాజు తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు.
తన నటనతో, మంచితనంతో కృష్ణంరాజు ప్రేక్షకుల హృదయాలలో చెరిగిపోని ముద్ర వేసుకున్నారు. వివాదాలకు దూరంగా ఉన్న కృష్ణంరాజు ప్రభాస్ స్టార్ హీరో కావడంలో కెరీర్ పరంగా అంతకంతకూ ఎదగడంలో కీలక పాత్ర పోషించారు. కృష్ణంరాజు మనసున్న మహారాజు అని సినిమాలలో రౌద్ర రసం ఒలికించి ఊహించని స్థాయిలో విజయాలను అందుకున్న ఆయన నిజ జీవితంలో మాత్రం మృదు స్వభావి అని చాలామంది చెబుతారు.
కొన్ని సినిమాలలో విలన్ రోల్స్ లో నటించిన ఆయన విలన్ పాత్రల ద్వారా కూడా కొత్త ట్రెండ్ ను సృష్టించడం గమనార్హం. ఒకవైపు బయట సినిమాలు మరోవైపు సొంత బ్యానర్ లో సినిమాలు చేస్తూ కృష్ణంరాజు నటుడిగా విజయాలను అందుకున్నారు. మొదటి భార్యను కోల్పోవడం తన జీవితంలో అత్యంత విషాదకర సంఘటన అని పలు సందర్భాలలో కృష్ణంరాజు చెప్పుకొచ్చారు.