రెబల్ స్టార్ కృష్ణంరాజు ఎక్కువగా ప్రభాస్ పెదనాన్నగానే ఇప్పటి ప్రేక్షకులకు తెలిసుంటుంది. కానీ అప్పట్లో ఆయన పెద్ద స్టార్ హీరో. అప్పట్లో ఎన్టీఆర్, ఏ.ఎన్.ఆర్.. నెంబర్ వన్ రేసింగ్ లో కొనసాగుతున్న తరుణంలో కృష్ణ, శోభన్ బాబులు లానే ఈయన కూడా గట్టిపోటీ ఇచ్చారు. మొదట్లో నెగిటివ్ పాత్రలతో ప్రేక్షకులకు దగ్గరైన కృష్ణంరాజు ఆ తరువాత ‘కృష్ణవేణి’ ‘భక్త కన్నప్ప’ ‘త్రిశూలం’ ‘బొబ్బిలి బ్రహ్మన్న’ ‘పల్నాటి పౌరుషం’ వంటి చిత్రాల్లో నటించి స్టార్ హీరోగా ఎదిగారు. ఇప్పటి వరకూ 183 సినిమాల్లో నటించారు కృష్ణంరాజు. ప్రభాస్ తో కూడా ‘బిల్లా’ ‘రెబల్’ వంటి చిత్రాల్లో నటించారు.
ఇక రాజకీయ నాయకుడుగా కూడా రాణించారు ఈయన. ‘బిజెపి పార్టీ’ తరుపున కేంద్ర మంత్రిగా పని చేసారు. ఈయన సొంత ఊరు ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మొగల్తూరు. ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృష్ణంరాజు ఓ ఆసక్తికరమైన సంఘటన గురించి చెప్పుకొచ్చారు. సాధారణంగా కృష్ణంరాజు గారి ఇంటికి.. అభిమానులొచ్చినా భోజనం చేస్తేనే కానీ పంపరట. ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు అంతా.. కృష్ణంరాజు గారు తన ఇంట్లో చేసే మర్యాదల గురించి కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. కృష్ణంరాజు ఈ మర్యాదలు అలవాటు చేసుకోవడం వెనుక పెద్ద కథే ఉందట. ‘కృష్ణంరాజుగారి చిన్నతనంలో.. ఓ సారి ఇతని ఇంటికి ఓ పెద్ద మనిషి వస్తే, ఆయన వచ్చే ముందు..వచ్చిన తర్వాత కూడా కాళ్ళు జాపుకుని తాపీగా కూర్చున్నారట కృష్ణంరాజు.
అతను వెళ్ళిపోయిన తరువాత కృష్ణంరాజు నాన్నగారు.. అతనితో ఇంట్లో ఉన్న కొరడాను తెప్పించి .. చితక్కొట్టి ఆ తరువాత అసలు సంగతి చెప్పారట. మన ఇంటికి ఎవరు వచ్చినా ముందు అతిథి మర్యాదలు చేసి ఆ తరువాత రిలాక్స్ అవ్వాలి’ అంటూ కృష్ణంరాజుకి అతని తండ్రి గారు చెప్పారట. అప్పటి నుండీ కృష్ణంరాజు గారు.. ఇంటికి ఎవరొచ్చినా మర్యాదలు చేస్తూనే ఉంటారట.. అది రాను రాను అతనికి సంతోషం కలిగించే విషయంగా కూడా మారిపోయిందని చెప్పుకొచ్చారు కృష్ణంరాజు.