కృష్ణంరాజు పరిపూర్ణ జీవితం అనుభవించారు అని అంటుంటారు. స్టార్ హీరోగా ఎంతగా రాణించారు.. తన తమ్ముడి కొడుకు ప్రభాస్‌ను అదే రేంజిలో చూసి మురిసిపోయారు. అయితే ఆయన జీవితంలో కొన్ని తీరనిన కోరికలు ఉన్నాయట. ఈ విషయాల్ని గతంలో ఆయన కొన్నిసార్లు ప్రస్తావించారు కూడా. దాంతోపాటు అభిమానుల కోరిక కూడా ఒకటి ఉంది. ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయిన నేపథ్యంలో ఓసారి వాటి గురించి చూద్దాం!
* నటుడిగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా కృష్ణంరాజు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తన అభిరుచికి తగ్గట్టుగా కొన్ని సినిమాలను తెరకెక్కిద్దాం అనుకున్నారు. అంతేకాదు గతంలో ఆయన నటించిన చిత్రాలను ప్రభాస్‌తో మళ్లీ తీద్దాం అనుకున్నారు కూడా.
* కృష్ణంరాజు సినిమా కెరీర్‌లో ‘భక్తకన్నప్ప’ ఓ పెద్ద మైలురాయి. అందుకే ఈ చిత్రాన్ని ప్రభాస్ హీరోగా మళ్లీ రీమేక్ చేద్దామనుకున్నారు. నేటి సాంకేతికత, పరిస్థితులకు అనుగుణంగా స్క్రిప్ట్ సిద్ధం చేశారు కూడా. సొంత బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో నిర్మిద్దాం అని ఆశపడ్డారు. అయితే ఆయన కల నెరవేరలేదు.
* ‘ఛత్రపతి’ సినిమాలో ఫేమస్ సింగిల్ లైనర్ ‘ఒక్క అడుగు’. ఇదే పేరుతో ఓ కథను సిద్ధం చేశారు కృష్ణంరాజు. మల్టీస్టారర్‌గా తెరకెక్కిద్దాం అనుకున్న ఈ చిత్రంలో ప్రభాస్ ఓ పాత్ర కూడా చేయాల్సి ఉంది. పెద్ద పెద్ద రచయితలు కూడా ఈ కథపై కసరత్తు చేశారు కూడా. అంతేకాదు సినిమా అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చారు. కానీ ప్రారంభం కాలేదు.
* ‘విశాల నేత్రాలు’ అనే నవలంటే కృష్ణంరాజుకు చాలా ఇష్టమట. ఆ నవల ఆధారంగా ఓ సినిమా తీయాలనుకున్నారు కూడా. ఒకట్రెండు సందర్భాల్లో ఆ సినిమా ప్రస్తావన వచ్చినా అది కార్యరూపం దాల్చలేదు.
* కృష్ణంరాజుకు ‘మన ఊరి పాండవులు’ సినిమా అంటే చాలా ఇష్టమట. ఆ సినిమాను రీమేక్ చేసే అవకాశం వస్తే, ప్రభాస్‌ను పెట్టి తీయాలనుకున్నారు. కానీ ఇది కూడా నెరవేరలేదు.
* ఇవన్నీ సినిమాల వరకు.. ఇక వ్యక్తిగత జీవితం గురించి చూస్తే.. ప్రభాస్ పెళ్లి చూడాలని కృష్ణంరాజు ఉవ్విళ్లూరుతూ ఉండేవారు. ఈ ప్రశ్న ఆయన ఎదురుగా ప్రస్తావించగానే ఆయన ముఖంలో ఓ వెలుగు వచ్చేది. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ పెళ్లిపై వార్తలు హల్‌చల్ చేశాయి. కానీ సినిమాలాగే ప్రభాస్ పెళ్లి కూడా వాయిదా పడుతూ వచ్చింది.
* ఇక రాజకీయ కెరీర్ చూస్తే… కేంద్ర మంత్రిగా సేవలందించిన కృష్ణంరాజుకు గవర్నర్‌గా పనిచేయాలని ఉండేదట. కొన్నేళ్ల క్రితం ఆయనకు గవర్నర్ పదవి ఇస్తారంటూ వార్తలు వెలువడ్డాయి కూడా. కానీ అది కూడా నిజం కాలేదు.