ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్ ప్రభుదేవా సపోర్టింగ్ రోల్ లో డ్యాన్స్ నేపధ్యంలో ఎ.ఎల్.విజయ్ తెరకెక్కించిన చిత్రం “లక్ష్మీ”. దిత్య టైటిల్ పాత్ర పోషించిన ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ కీలకపాత్ర పోషించగా.. తెలుగు-తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు విడుదలైంది. మరి ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకులు కూడా డ్యాన్స్ చేశారా లేదా చూద్దాం..!!
కథ : చిన్నప్పట్నుంచి డ్యాన్స్ పట్ల విపరీతమైన అభిమానం ఉన్న చిన్నారి లక్ష్మీ (దిత్య). కానీ.. ఆమె తల్లి నందినికి (ఐశ్వర్య రాజేష్) మాత్రం డ్యాన్స్ అంటే ఇష్టం ఉండదు. కానీ.. డ్యాన్స్ మీద ఉన్న ప్యాషన్ తో తల్లికి తెలియకుండా డ్యాన్స్ క్లాస్ లో జాయిన్ అవుతుంది లక్ష్మీ. డ్యాన్స్ పట్ల లక్ష్మికి ఉన్న ఇష్టం చూసి ఫైనాన్షియల్ గా ఆమెకు సపోర్ట్ చేస్తుంటాడు కృష్ణ (ప్రభుదేవా). ఈ ముగ్గురికీ ఒక అవినాభావ సంబంధం ఉంటుంది.
ఏమిటా సంబంధం? లక్ష్మీ తనకు అత్యంత ప్రీతిపాత్రమైన డ్యాన్స్ ను కెరీర్ గా ఎంచుకోగలిగిందా? అందుకు ఆమె తల్లి ఎంతవరకూ సపోర్ట్ చేసింది? కృష్ణ తోడుగా ఉండడం లక్ష్మికి ఎంతవరకూ ప్లస్ అయ్యింది? అనేది “లక్ష్మీ” సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.
నటీనటుల పనితీరు : చేప ఫాస్ట్ గా ఈదుతుంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఎలా అయితే ఉండదో.. ప్రభుదేవా తన డ్యాన్స్ మూమెంట్స్ తో మేజిక్ క్రియేట్ చేశాడు అని కూడా ప్రత్యేకించి ప్రశంసించాల్సిన అవసరం ఉండదు. సపోర్టింగ్ రోల్ అయినప్పటికీ సినిమా మొత్తం ప్రభుదేవా చుట్టూనే తిరుగుతుంది. ఎమోషనల్ సీన్స్ లోనూ తనదైన హావభావాలతో ఆకట్టుకొన్నాడు ప్రభుదేవా.
దిత్య సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమె చలాకీతనం, ఎలాంటి అలసట లేకుండా చేసే డ్యాన్స్ చూడ్డానికి భలే ఉంటాయి. దిత్య & ఆమె ఫ్రెండ్స్ గనుక సినిమాలో లేకుంటే ఫస్టాఫ్ లోనే థియేటర్ నుంచి పారిపోయేవారు ప్రేక్షకులు.పిల్లలందరూ నృత్యంతో, హాస్యంతో అలరించారు. వాళ్లందరి కష్టం వృధా పోయిందనే బాధ తప్పితే.. వాళ్ళ డ్యాన్సులు చూడడానికి రెండు కళ్ళూ చాలవు.
సాంకేతికవర్గం పనితీరు : నృత్య ప్రధాన చిత్రం కావడంతో సామ్ సి.ఎస్ ఎక్కువ కష్టపడాల్సిన అవసరం రాలేదు. సింపుల్ గా రాక్ & బీట్ సౌండ్స్ తో లాగించేశాడు. అందించిన రెండు పాటలు సోసోగా ఉన్నాయి.
నిరవ్ సినిమాటోగ్రఫీ క్వాలిటీ బాగుంది కానీ.. ఒక డ్యాన్సింగ్ ఫిలిమ్ కి పడాల్సిన ఫ్రేమ్ ఒక్కటి కూడా లేదు. ఎలివేషన్ షాట్స్ పడాల్సిన అవసరం లేదు కానీ.. పిల్లల డ్యాన్స్ మూమెంట్స్ ఎలివేట్ అవ్వాలి కదా. అది కూడా లేకపోవడం బాధాకరం.
డైరెక్టర్ విజయ్ కథ రాసుకొన్నాక సినిమా మొదలెట్టాడా లేక సినిమా మొదలెట్టాక కథ రాయడం ప్రారంభించాడా అనే డౌట్ సినిమా ఫస్టాఫ్ కంప్లీట్ అయ్యేసరికి వచ్చి.. సినిమా అయ్యేవరకు వెంటాడుతూనే ఉంటుంది. క్లైమాక్స్ లో హాలీవుడ్ ఫిలిమ్ “రియల్ స్టీల్” నుంచి ఇన్స్పైర్ అయిన షాడో ఫైట్ నుంచి షాడో డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చూస్తున్నంతసేపు ఎమోషనల్ గా ఫీల్ అవ్వాలో లేక నవ్వాలో అర్ధం కాక కన్ఫ్యూజన్ లో కొట్టుమిట్టాడుతుంటాడు ప్రేక్షకుడు. “మదరాసు పట్టణం” అనే ఒక డిఫరెంట్ ఫిలిమ్ తెరకెక్కించిన విజయ్ ఆ తర్వాత “అన్న” తప్ప చెప్పుకోదగ్గ సినిమా ఒక్కటి కూడా తీయలేదు.
ఇలాంటి సింపుల్ స్టోరీస్ తో ఆకట్టుకోవాలని విజయ్ చేసే ప్రయత్నంలో నిజాయితీ ఉందో లేదో తెలియదు కానీ.. కథ-కథనం మాత్రం కనిపించడం లేదు. కనీసం తదుపరి చిత్రం కోసమైనా కాస్త కథ-కథనాలపై దృష్టి సారిస్తాడేమో చూడాలి.
విశ్లేషణ : చిన్న పిల్లలు ఎంతో కష్టపడి చేసే డ్యాన్సులు తప్ప సినిమా మొత్తంలో ఆకట్టుకొనే అంశం కానీ.. ప్రేక్షకుడ్ని హోల్డ్ చేయగల ఎమోషన్ కానీ లేకపోవడంతో ప్రేక్షకుల్ని రెండు గంటలపాటు థియేటర్లో కూర్చోబెట్టడం అనేది చాలా కష్టం. సో, చిన్నారులు శ్రమించి చేసిన డ్యాన్సులు చూడడం కోసం మీ చిన్నారులతో ఈ సినిమా చూడండి లేదంటే యూట్యూబ్ లో ఢీ 10 లేదా ఢీ జూనియర్స్ ప్రోగ్రామ్ చూడడం ఉత్తమం.