విజయ్ దేవరకొండ – పూరి జగన్నాథ్‌ల ‘లైగర్’ సినిమా సెన్సార్ పూర్తయింది. అదేంటి సినిమా విడుదలకు ఇంకా చాలా రోజులు ఉంది కదా. అప్పుడే సెన్సార్ ఏంటి అనుకుంటున్నారా? మీరన్నది నిజమే. కానీ అక్కడ సినిమా బాలీవుడ్ స్టయిల్‌లోనే తెరకెక్కిందనే విషయం మీకు తెలిసిందే. సినిమా షూటింగ్ అంతా బాలీవుడ్ అట్మాస్పియర్‌లోనే రూపొందింది. సినిమా ప్రచారం కూడా బాలీవుడ్‌లోనే చేస్తున్నారు. ఇక్కడో థియేటర్‌లో ఓ చిన్న సందడి చేసి వెళ్లిపోయారు. కాబట్టి సెన్సార్ కూడా బాలీవుడ్ స్టయిల్‌లోనే పూర్తి చేశారట.
‘లైగర్’ సినిమాను ఆగస్టు 25న హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో సినిమా విడుదల దగ్గర్లో సెన్సార్ పూర్తి చేసి ఇబ్బంది పడకుండా ముందుగానే సెన్సార్ పనులు పూర్తి చేశారట పూరి జగన్నాథ్ అండ్ కో. ఈ నేపథ్యంలో సినిమా నిడివి ఎంత, పాటలెన్ని, ఫైట్లెన్నీ లాంటి వివరాలు బయటికొచ్చాయి. అన్ని తెలుగు సినిమాల్లా సెన్సార్ టాక్ అంటూ ఓ ఫేక్ రిపోర్ట్/టాక్ అయితే బయటకు రాలేదు.
బాలీవుడ్ సమాచారం ప్రకారం ‘లైగర్’ సినిమాకు యు / ఎ సర్టిఫికెట్ లభించిందట. సినిమా నిడివి 2 గంటల 20 నిమిషాలు ఉందట. ఫస్ట్ హాఫ్ 75 నిమిషాలు ఉండగా, సెకండాఫ్ ఒక గంట ఐదు నిమిషాలు మాత్రమే ఉందట. పూరి జగన్నాథ్ సినిమాలు మామూలుగానే స్పీడ్‌గా ఉంటాయి. ఇప్పుడు ‘లైగర్’ కూడా అదే రీతిలో సాగుతుందట. ఇక ఈ సినిమా మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్, బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిందనే విషయం తెలిసిందే.
ఆ లెక్కన సినిమాలో ఫైట్లు ఎక్కువగానే ఉంటాయని అంచనా వేయొచ్చు. సినిమాలో మొత్తం ఏడు ఫైట్లు, ఆరు పాటలు ఉన్నాయని సమాచారం. విజయ్ దేవరకొండ సరసన అనన్యా పాండే కథానాయికగా నటించింది. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్‌ను కీలక పాత్రలో తీసుకున్నారు. ఇక రమ్యకృష్ణ మరో ముఖ్యపాత్రధారి. ఇక ఈ సినిమా క్లైమాక్స్‌లో టైసన్, విజయ్ మధ్య ఫైట్ హైలైట్‌గా ఉంటుంది అంటున్నారు. అలాగే లేడీ బాక్సర్లతో విజయ్ ఫైట్ కూడా స్పెషల్ అట్రాక్షన్ అట.వవ