ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు పెద్దోళ్లు. అంటే ఇక్కడ మొదలెట్టి బయటెక్కడో ముగించమని కాదు. సొంత ప్రాంతంలో విజయం సాధించి, ఆ తర్వాత ఆ ఊపును పక్క రాష్ట్రాల్లో కొనసాగించి మన సత్తా చూపించాలి. అయితే ‘లైగర్’ సినిమా టీమ్‌కు వేరేగా అర్థమైనట్లుంది. అందుకే సినిమా షూటింగ్, ప్రచారం అన్నీ బాలీవుడ్ స్టయిల్‌లో, బాలీవుడ్‌లోనే చేసింది. తీరా ఇప్పుడు సినిమా తేడా కొట్టేసరికి ఇల్లు గుర్తొచ్చింది అంటున్నారు నెటిజన్లు. అంటే టాలీవుడ్ ఇప్పుడు గుర్తొచ్చిందన్నమాట.
‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా విజయం తర్వాత ఆ ఊపులో ‘లైగర్’ సినిమా అనౌన్స్ చేసి స్టార్ట్ చేశారు పూరి జగన్నాథ్ – విజయ్ దేవరకొండ – ఛార్మి. అయితే తమ ప్రాడెక్ట్ రుచిని బాలీవుడ్‌కి చూపించి అక్కడ కరణ్ జోహార్‌ను బుట్టలో పడేశారు. ఆయన ఏ కారణంతో ఓకే అనుకున్నారో కానీ.. ‘ఈ దేశాన్ని షేక్ చేసే సినిమా’కు నిర్మాతగా మారిపోయారు. ఆ తర్వాత ‘లైగర్’ టీమ్ టాలీవుడ్‌ని పట్టించుకున్నది లేదు.
తెలుగు ప్రేక్షకుల కోసం ‘ఫ్యాన్‌డమ్’ టూర్ అంటూ వరంగల్‌లో ఓ ఈవెంట్, గుంటూరులో ఓ ప్రీరిలీజ్ ఈవెంట్ పెట్టి చేతులు దులుపుకున్నారు. హైదరాబాద్‌లో ఓ యాటిట్యూడ్ ప్రెస్‌మీట్ పెట్టి మమ అనిపించారు. పాన్ ఇండియా సినిమా కాబట్టి దేశంలో చాలా నగరాలు తిరిగేశారు. ఎక్కడికెళ్లినా జనాల తాకిడి ఎక్కువై ఇలా కార్యక్రమం స్టార్ట్ చేసి, అలా వెంటనే అక్కడి నుండి వెళ్లిపోయారు. తెలుగు రాష్ట్రాల్లో ఇన్ని ఊళ్లు ఉన్నాయి ఎక్కడా అలాంటి కార్యక్రమాలు జరగలేదు.
అయితే, ఇప్పుడు ‘లైగర్’ టీమ్‌కి తెలుగు రాష్ట్రాలు గుర్తొచ్చాయి అని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ విజిట్ చేయాలని అనుకుంటున్నారట ‘లైగర్’ పీఆర్ టీమ్. తెలంగాణతో స్టార్ట్ చేసి, ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమైన నగరాలు, పట్టణాల్లో టీమ్‌ను తీసుకొని వెళ్లి హైప్ తీసుకురావాలని చూస్తున్నారట. సోమవారం ఈ విషయంలో క్లారిటీ వస్తుందని అంటున్నారు. అయితే సినిమాకు వస్తున్న డిజాస్టర్ టాక్ చూసి కూడా ఇలాంటి పని చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.