కోలీవుడ్‌లో భారీ బడ్జెట్ సినిమాలు తీసే లైకా ప్రొడక్షన్స్‌కు (Lyca productions) మళ్లీ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సంక్రాంతి కానుకగా విడుదలైన అజిత్ సినిమా విదాముయార్చి నిరాశపరిచింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా, మొదటి రోజు బంపర్ ఓపెనింగ్స్ సాధించినా, వారం గడిచే సరికి వసూళ్లలో బలహీనపడింది. తెలుగులోనూ సినిమా నిరాశపరిచింది. చివరికి ఇది అజిత్ (Ajith Kumar) ఖాతాలో మరో ప్లాప్‌గా మిగిలింది. విదాముయార్చి (Vidaamuyarchi) ఫలితం అజిత్‌కు పెద్దగా నష్టం కాకపోయినప్పటికి, లైకా ప్రొడక్షన్స్‌కు మాత్రం గట్టి దెబ్బగా మారింది.
కోలీవుడ్ వర్గాల ప్రకారం ఈ సినిమా బడ్జెట్ సుమారుగా రూ.200 కోట్లని, కానీ రికవరీ కేవలం రూ.75 నుంచి 90 కోట్ల మధ్యలోనే ఆగిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వరుస పరాజయాలతో నష్టాల్లో ఉన్న లైకా ప్రొడక్షన్స్‌కు ఇది మరింత ఆర్థిక భారాన్ని తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. లైకా పరిస్థితి ఒకటే కాదు. గతంలో పొన్నియిన్ సెల్వన్ 2 (Ponniyin Selvan: 2) తర్వాత ఆ సంస్థ నుంచి వచ్చిన ప్రతి సినిమా ఫ్లాప్ అయ్యింది.
చంద్రముఖి 2, మిషన్ చాప్టర్ 1, లాల్ సలామ్ (Lal Salaam), వెట్టేయాన్ (Vettaiyan), ఇండియన్ 2 (Indian 2) వంటి భారీ బడ్జెట్ సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయాయి. వాటిలో కొన్ని డిజాస్టర్లు గానే ముగిశాయి. వందల కోట్ల పెట్టుబడులు కూడా తిరిగి రాలేదు. ప్రస్తుతం లైకా (Lyca productions) ఆశలు రెండు సినిమాలపై ఉన్నాయి.
ఒకటి శంకర్ (Shankar) దర్శకత్వంలో కమల్ హాసన్ (Kamal Haasan) నటిస్తున్న ఇండియన్ 3. అయితే, ఇండియన్ 2 ఫ్లాప్ కావడంతో మూడో భాగంపై పెద్దగా బజ్ లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు మోహన్ లాల్ (Mohanlal) నటిస్తున్న మలయాళ సీక్వెల్ లూసిఫర్ 2 (L2: Empuraan) మీద లైకా చాలా భరోసా పెట్టుకుంది. మొదటి భాగం బ్లాక్‌బస్టర్ కావడంతో సీక్వెల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.