సీనియర్ నటుడు మోహన్ బాబు (Mohan Babu) ఇటీవల ఒక వివాదాస్పద కేసు కారణంగా వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని తన నివాసంలో జర్నలిస్టుతో జరిగిన ఘర్షణతో ఆయనపై యత్యాయత్నం కేసు నమోదైంది. 2024 డిసెంబర్ 10న జరిగిన ఈ ఘటనలో, మోహన్ బాబు ఒక జర్నలిస్టుపై మైక్‌తో దాడి చేశారన్న ఆరోపణలతో పహాడిషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం మరింత చర్చనీయాంశమైంది.
ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం మోహన్ బాబు మొదటగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే, హైకోర్టు ఆయన దరఖాస్తును తిరస్కరించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో మోహన్ బాబు తన వాదనలు వినిపిస్తూ, తాను కావాలని జర్నలిస్టుపై దాడి చేయలేదని, అనుకోని పరిస్థితుల్లో వివాదం తలెత్తిందని తెలిపారు. ఈ వాదనల ఆధారంగా సుప్రీంకోర్టు మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ కీలక తీర్పు ఇచ్చింది.
ఈ పరిణామంతో మోహన్ బాబుకు ఆయన కుటుంబ సభ్యులకు ఊరట కలిగించింది. సుప్రీంకోర్టు ముందు తన వాదనల్లో మోహన్ బాబు, కుటుంబ సమస్యల కారణంగా కొన్ని సంఘటనలు అనుకోని విధంగా జరిగాయని తెలిపారు. తనకు జర్నలిస్టుపై ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదని, ఆ సంఘటనతో కలిగిన నష్టానికి పరిహారం ఇచ్చేందుకు కూడా సిద్ధమని కోర్టు ముందు స్పష్టం చేశారు. మంచు కుటుంబలో అంతర్గత సమస్యలు ఈ వివాదం నేపథ్యంలో మరింత బయటపడ్డాయి.
ముఖ్యంగా మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్‌తో (Manchu Manoj) ఉన్న విభేదాలు సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఇటీవల తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్శిటీలో జరిగిన ఘర్షణ ఈ వివాదాలకు నిదర్శనంగా మారింది. బౌన్సర్ల మధ్య జరిగిన గొడవ పోలీసుల జోక్యంతో సమసిపోయింది. ప్రస్తుతం మోహన్ బాబు ముందస్తు బెయిల్ పొందినప్పటికీ, కేసు విచారణ కొనసాగుతుండటంతో మరిన్ని పరిణామాలు వెలుగు చూడవచ్చని తెలుస్తోంది.