మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల వ్యవహారంలో కీలక ఘట్టం ముగిసింది. చాలా రోజులుగా పోటీదారులు, ‘మా’ ఎన్నికల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రజలు ఇప్పుడు అసలు సిసలు ‘మా’ రాజకీయం చూడబోతున్నారు. ఎన్నికల విషయం, తేదీ తదితర అంశాలను నిర్ణయించడానికి ఇటీవల ‘మా’ క్రమశిక్షణ సంఘం భేటీ నిర్వహించారు. కృష్ణంరాజు, మురళీమోహన్, మోహన్‌బాబు తదితర పెద్దల సమక్షంలో ఈ వర్చువల్ భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల తేదీపై కాస్త స్పష్టత వచ్చింది.
సమావేశంలో ‘మా’ఎన్నికలు వెంటనే నిర్వహించాలని కొందరు డిమాండ్ చేయగా, కరోనా పరిస్థితుల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని మరికొందరు సూచించారు. ఈ క్రమంలో ఎన్నికల తేదీలపై ‘మా’ సభ్యులు భిన్నాభిప్రాయాలు తెలిపారని తెలుస్తోంది. కొందరు సెప్టెంబరు, మరికొందరు అక్టోబరులో నిర్వహించాలని కోరారట. ఈ నేపథ్యంలో వారం రోజుల్లో ఎన్నికల తేదీని ప్రకటిస్తామని సీనియర్ నటులు కృష్ణంరాజు, మురళీమోహన్ తెలిపారు.
కొంతమంది కోరుతున్నట్లు 21 రోజుల్లో ఎన్నికలు నిర్వహించడం ప్రస్తుతం అసాధ్యం. ప్రభుత్వం నుండి అనుమతులు తీసుకుని, భౌతిక దూరం పాటిస్తూ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. సెప్టెంబరు రెండో వారం నుండి అక్టోబరు రెండో వారం మధ్యలో అనువుగా ఉండే తేదీ చూసుకొని ఎన్నికలు నిర్వహిస్తాం. అప్పటి వరకూ అందరూ సంయమనంతో ఉండండి అని మురళీ మోహన్ తెలిపారు. మరో వారంలో ఎన్నికల తేదీ వచ్చేస్తుంది… అప్పుడు ‘మా’ రాజకీయం ఇంకెంత వేడెక్కుతుందో.