సంక్రాంతి మాస్ మూవీగా విడుదలైన నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) “డాకు మహారాజ్” (Daaku Maharaaj) సినిమా మంచి హైప్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. బాబీ (K. S. Ravindra) దర్శకత్వంలో, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా బాలయ్య ఫ్యాన్స్‌ని ఎక్కువగా ఆకట్టుకుంది. కానీ, సినిమా విడుదల తర్వాత థియేటర్ల కేటాయింపుల విషయంలో బాలయ్య అసంతృప్తిగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రధానంగా నైజాం ఏరియాలో ఈ సినిమాకు తగినంత థియేటర్ల కేటాయింపులు లేవని తెలుస్తోంది.సంక్రాంతి బరిలో ఇతర పెద్ద సినిమాలు ఉండటంతో “డాకు మహారాజ్”కు కేవలం 180 థియేటర్లే దక్కాయి.
Balakrishna
అదే సమయంలో “సంక్రాంతికి వస్తున్నాం” (Sankranthiki Vasthunam) వంటి సినిమాలు 250కి పైగా థియేటర్లను కైవసం చేసుకోవడం చర్చనీయాంశమైంది. బాలయ్య అభిమానులు కూడా ఈ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య గత చిత్రం 5 రోజుల్లో “భగవంత్ కేసరి”(Bhagavanth Kesari) నైజాంలో 15 కోట్ల కలెక్షన్లు రాబట్టగా, ఈసారి “డాకు మహారాజ్” 10 కోట్లలోనే రాబట్టింది. సంక్రాంతి పండగ సీజన్‌ను ఉపయోగించుకొని కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలు ఉన్నప్పటికీ, తగినంత థియేటర్లు లేకపోవడం వసూళ్లపై ప్రభావం చూపిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
దిల్ రాజు నైజాంలో ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నందున, అతను తన ఇతర సినిమాలైన “గేమ్ ఛేంజర్” (Game Changer) “సంక్రాంతికి వస్తున్నాం”కు ప్రాధాన్యం ఇచ్చినట్లు టాక్. దీనికి తోడు నైజాంలో ఆసియన్ సురేశ్ బాబు ఆధిపత్యం ఎక్కువగా ఉండటంతో, వెంకటేష్ (Venkatesh Daggubati) ప్రధాన పాత్రలో ఉన్న సినిమా మరింత స్క్రీన్లు కైవసం చేసుకుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిణామాలు చూసి బాలయ్య తగినంత థియేటర్ల కేటాయింపులు లేకపోవడం పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.