హింసాత్మకమైన సినిమాలకు భారతీయ పరిశ్రమ ఎప్పుడూ ఒక లిమిట్ పాటిస్తూ వచ్చింది. ఎంతటి విధ్వంశాన్నైనా ఒక స్థాయి వరకు మాత్రమే తెరపై చూపించింది. కానీ.. ఆ పరిమితులను తుంగలో తొక్కిన మలయాళ చిత్రం “మార్కో”. ఉన్ని ముకుందన్ కథానాయకుడిగా, హనీఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గతవారం మలయాళ & హిందీ వెర్షన్స్ విడుదలై భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. మరి ఈ సినిమా ఏ తరహా ఆడియన్స్ ను సంతృప్తిపరుస్తుంది? ఎటువంటి ప్రేక్షకులు ఈ సినిమాకి దూరంగా ఉండాలి? అనేది చూద్దాం..!!
Macro Review
కథ: జార్జ్ (సిద్ధిఖీ) మరియు అతని సవతి తమ్ముడు మార్కో (ఉన్ని ముకుందన్) మాఫియా సిండికేట్ హెడ్స్ గా వ్యవహరిస్తుంటారు. జార్జ్ అసలు తమ్ముడైన విక్టర్ (ఇషాన్)ను కొందరు అత్యంత క్రూరంగా హతమారుస్తారు.
వాళ్లను మార్కో ఎలా పట్టుకున్నాడు? ఆ పగ తీర్చుకోవడం మార్కో కుటుంబాన్ని ఎలా ఎఫెక్ట్ చేసింది? అనేది “మార్కో” సినిమా కథాంశం.
నటీనటుల పనితీరు: ఉన్ని ముకుందన్ ను మాస్ హీరోగా ఇప్పటికే చూశాం, అందువల్ల అతడు ఏస్థాయిలో యాక్షన్ సీన్స్ చేసినా మామూలుగానే అనిపిస్తాయి. అందరికంటే మంచి ఎలివేషన్ వచ్చింది మాత్రం సిద్దిఖీ మరియు కబీర్ దుహాన్ సింగ్ లకు మాత్రమే. వారి పాత్రలను ప్రెజెంట్ చేసిన తీరు బాగుంది. ముఖ్యంగా కబీర్ దుహాన్ సింగ్ కెరీర్ లో “జిల్” తర్వాత అతడి బాడీ లాంగ్వేజ్ ను సరిగ్గా వినియోగించుకున్న సినిమా ఇదే అని చెప్పాలి.
జగదీష్, అభిమన్యులు విలనిజాన్ని ఎలివేట్ చేసిన విధానం బాగుంది.
ఇక మిగతా పాత్రలు కేవలం రెండు డైలాగులు, ఒక డెత్ సీన్ కి పరిమితం అయిపోయాయి.
సాంకేతికవర్గం పనితీరు: కలాయ్ కింగ్సన్ యాక్షన్ కొరియోగ్రఫీ గురించి ముందుగా చెప్పుకోవాలి. అసలు కథ-కథనంలో ఏమాత్రం పట్టులేకపోయినా కేవలం యాక్షన్ బ్లాక్స్ తోనే లాక్కొచ్చేశారు. ముఖ్యంగా “ది రెయిడ్” అనే ఇండోనేషియన్ సినిమాలోని యాక్షన్ బ్లాక్స్ ఆధారంగా తెరకెక్కించిన బిల్డింగ్ ఫైట్ మంచి కిక్ ఇస్తుంది. అయితే.. ఫ్యామిలీ మొత్తాన్ని విలన్ అటాక్ చేసే సీన్ లో హింస శృతి మించింది. ఒక స్టేజ్ లో ఇది హింస కాదు సాడిజం అనిపిస్తుంది. ప్రసవ వేదన అనుభవిస్తున్న అమ్మాయి కడుపుపై గుద్ది బిడ్డను చేత్తో లాగేయడం, చిన్న పిల్లాడిని గ్యాస్ సిలిండర్ తో మోది చంపడం, తల్లి పాత్ర నోటిని రెండు వేళ్లతో చీరేయడం వంటివి జుగుప్సాకరంగా ఉన్నాయి. మరి ఈ సీన్స్ ను సెన్సార్ బోర్డ్ కేవలం “ఎ” సర్టిఫికెట్ తో ఎలా రిలీజ్ చేసింది అనేది పెద్ద ప్రశ్న.
దర్శకుడు హనీఫ్ అసలు ఈ సన్నివేశాలను ఎలా కంపోజ్ చేశాడు అనేదానికంటే నటీనటులను ఎలా ఒప్పించాడు అనేది పెద్ద ప్రశ్నగా మిగిలిపోతుంది. ఈ స్థాయి రక్తపాతం కొరియన్ బీగ్రేడ్ సినిమాల్లో 90ల కాలం వరకు చూసాం, ఆ తర్వాత కూడా కొన్ని జపనీస్ మరియు “రాంగ్ టర్న్, హిల్స్ హేవ్ ఐఎస్ వంటి హాలీవుడ్ యాక్షన్ సినిమాల్లో చూసాం, కానీ ఇండియన్ సినిమాలో ఈస్థాయిలో రక్తం పారడం అనేది మొదటిసారి అని చెప్పాలి. ఈ యాక్షన్ బ్లాక్స్ ను మరీ ముఖ్యంగా ప్రీక్లైమాక్స్ యాక్షన్ బ్లాక్ ను మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకులు చూడలేరు.
రవి బ్రస్రూర్ సంగీతం & చంద్ర సినిమాటోగ్రఫీ వర్క్ మాత్రం అత్యద్భుతంగా ఉన్నాయి. అలాగే.. ప్రొడక్షన్ డిజైన్ కూడా బాగుంది. ఆర్ట్ వర్క్ కూడా చాలా వరకు యాక్షన్ బ్లాక్స్ సహజంగా ఉండేలా చేసింది.
విశ్లేషణ: హింసను ఆస్వాదించే స్థాయికి మన సమాజం ఇంకా రాలేదు కానీ, ఆ హింస నుండి హీరోయిజం లేదా కథ యొక్క గమనం ఎలివేట్ అయితే మాత్రం ఆ హింసాత్మక ఘటనల తాలుకు ఇంటెన్సిటీని ఎంజాయ్ చేస్తారు ప్రేక్షకులు. “మార్కో”లో ఇంటెన్సిటీ కంటే హింస ఎక్కువైపోయింది, ఏదో హాలీవుడ్, కొరియన్ యాక్షన్ సినిమాల మోజులో మోతాదుకు మించిన జుగుప్సాకరమైన యాక్షన్ సినిమాలను ఆడియన్స్ మీదకు వదలడం అనేది కచ్చితంగా పైశాచికత్వమే అవుతుంది. అయితే.. ఆ పైశాశికతను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు అనేది సినిమాకి వస్తున్న కలెక్షన్స్ ప్రూవ్ చేస్తుండడం గమనార్హం. మీ గుండె మరీ కరడుగట్టేసి, ఎంతటి హింసాత్మకమైన ఘటననైనా కళ్ళు ముడుచుకోకుండా చూడగల రాటుదేలిన స్వభావం ఉంటేనే “మార్కో”ను థియేటర్లలో చూసేందుకు సాహసించండి.
ఫోకస్ పాయింట్: మరీ ఇంత వైల్డ్ వయలెన్స్ అవసరమా?!
రేటింగ్: 2/5
Rating
2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus