సినిమా హీరోలు సినిమాల్లో నటించడమే కాదు.. ఆ సినిమాలతో వ్యాపారం కూడా చేస్తున్నారు. ఒకప్పుడు నిర్మాతలకు మాత్రమే థియేటర్ల వ్యాపారం ఉండేది. లేదంటే ఫైనాన్సియర్లు ఆ బిజినెస్ చేసేవారు. లేదంటే సినిమాల బిజినెస్ చేసేవాళ్లు నిర్మాతలుగా మారారు. అయితే ఇప్పుడు ఏకంగా హీరోలే సినిమాల బిజినెస్‌లోకి వచ్చేశారు. వరుసగా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు కడుతూ దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాలకు కూడా మన హీరోల మల్టీప్లెక్స్‌లు వెళ్తున్నాయి. టాలీవుడ్‌లో మల్టీప్లెక్స్ బిజినెస్ స్టార్ట్ చేసిన హీరోల్లో తొలి హీరో మహేష్‌బాబు అని చెప్పాలి.
అప్పటికే కొంతమంది హీరోలకు బిజినెస్‌లు ఉన్నా.. డైరెక్ట్‌గా పేరుతో వచ్చింది మహేషే (Mahesh Babu). ఏఎంబీ సినిమాస్ అంటూ.. హైదరాబాద్‌లో భారీ మల్టీప్లెక్స్ నిర్మించారు. ఇప్పుడు ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో మరొకటి సిద్ధం చేస్తున్నారని టాక్. ఆ విషయంలో త్వరలో ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఈలోపు మహేష్ తన ఏఎంబీని కర్ణాటకకు విస్తరించారు. అక్కడ ఏఎంబీ సినిమాస్ పనులు మొదలయ్యాయి. దీనికి సంబంధించి ఏషియన్ సినిమాస్ సంస్థ అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటించింది.
త్వరలోనే మల్టీప్లెక్స్ ప్రేక్షకుల ముందుకు వస్తుంది అని చెప్పింది. ప్రస్తుతం డిజైన్, ఇంటీరియర్, థియేటర్ల పనులు జరుగుతున్నాయట. త్వరలోనే వీటిని పూర్తి చేసి స్క్రీన్స్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారట. బెంగళూరుకు ఇవి కీలకంగా మారుతాయి అని కూడా అంటున్నారు. అక్కడ సినిమా బిజినెస్ కింగ్ అని పిలవబడే రాక్‌లైన్ వెంకటేశ్ ఆ ఫొటోల్లో కనిపిస్తుండటం విశేషం. ఇక మల్టీప్లెక్స్ బిజినెస్‌లో మహేష్ బాబుతో పాటు ఇతర హీరోలు కూడా ఉన్నారు.
మహబూబ్ నగర్‌లో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఒక మల్టీప్లెక్స్‌ను ప్రారంభించాడు. AAA సినిమాస్ పేరుతో అమీర్‌పేట్‌లో అల్లు అర్జున్ (Allu Arjun) ఓ మల్టీప్లెక్స్ ప్రారంభించాడు. రవితేజ (Ravi Teja) కూడా ఏషియన్ సంస్థతో కలిసి ఏఆర్‌టీ సినిమాస్ పేరుతో ఈ రంగంలోకి దిగారు. నగరం ప్రారంభంలో ఉన్న వనస్థలిపురంలో ఈ మేరకు మల్టీప్లెక్స్ పనులు ఇటీవల లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఇంకా మరికొందరు ఈ దారిలో ఉన్నారు అని టాక్.