కరోనా వైరస్ కారణంగా ప్రజలు ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి. బయట కఠిన ఆంక్షలతో పాటు, అన్ని సంస్థలు బంద్ లో ఉండడం వలన చాల మందికి వేరే వ్యాపకం లేకుండా పోయింది. ఎప్పుడూ లేనిది చాలా మంది టీవీలకు అతుక్కుపోతున్నారు. న్యూస్ వంటి విషయాలతో పాటు అనేక హిట్ చిత్రాలను వదలకుండా చూసేస్తున్నారు. దీనితో హిట్ చిత్రాల శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న సంస్థల పంట పండుతుంది. ఇటీవల బుల్లితెరపై ప్రదర్శించిన బడిన తెలుగు చిత్రాలు భారీ టీఆర్పీ రేటింగ్ దక్కించుకున్నాయి.
వాటిలో ఒకటి మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు కాగా, మరొకటి ధరమ్ తేజ్ ప్రతిరోజూ పండగే. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ హీరోగా సంక్రాంతి కానుకగా విడుదలైన సరిలేరు నీకెవ్వరు మహేష్ ఆల్ టైం బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. మహేష్-రష్మిక మందాన జంటగా వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఉగాది కానుకగా జెమినీ టీవీలో ప్రసారం కావడం జరిగింది. కాగా ఈ చిత్రం ఏకంగా 23.4 టీఆర్పీ దక్కించుకొని అల్ టైం టాప్ టీఆర్పీ సాధించిన చిత్రంగా నిలిచింది.
దేశాన్ని ఒక ఊపు ఊపిన బాహుబలి 2 కి సైతం టీఆర్పీ 22 రాగా,మహేష్ మూవీ దానిని అధిగమించింది. ఇక గత ఏడాది క్రిస్మస్ కానుకగా వచ్చిన ప్రతిరోజూ పండగే సైతం భారీ టీఆర్పీ సాధించింది. సాయిధరమ్ హీరోగా డైరెక్టర్ మారుతీ తెరకెక్కించిన ప్రతిరోజూ పండగే చిత్రం 15.3 టీఆర్పీ అందుకొని ఆశ్ఛర్య పరిచింది. ఈ మూవీ స్టార్ మా లో ప్రసారం కావడం జరిగింది. ఇలా కరోనా ప్రభావంతో బుల్లితెరపై హిట్ మూవీస్ సంచలనాలు నమోదు చేస్తున్నాయి.