సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా ఎస్.ఎస్.రాజమౌళి (S. S. Rajamouli) దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. దీని గురించి 2010 లో మహేష్ బాబు రివీల్ చేయడం జరిగింది. అయితే వెంటనే ఈ ప్రాజెక్టు సెట్ అవ్వలేదు. ఆ తర్వాత మహేష్ బాబు 13 సినిమాలు చేశాడు. రాజమౌళి 4 సినిమాలు చేశాడు. మొత్తానికి ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR Movie) షూటింగ్ టైంలో రాజమౌళి… మహేష్ బాబుతో సినిమా చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి చాలా కాలంగా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
Mahesh Babu
అధికారికంగా ఈ ప్రాజెక్టుని అనౌన్స్ చేసింది లేదు. అలాగే అధికారిక ప్రకటన లేకుండానే ఈ సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో నిర్వహిస్తున్నారు రాజమౌళి అండ్ టీం.దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందనుంది. ఇదిలా ఉండగా.. రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు ఓ సెంటిమెంట్ బ్రేక్ చేశాడట. అదేంటంటే.. తన సినిమాల ఓపెనింగ్స్ కి ముఖ్యంగా పూజా కార్యక్రమాలకి మహేష్ బాబు హాజరుకాడు.
ఇది అతనికి సెంటిమెంట్.ఈ విషయాన్ని పలు ఇంటర్వ్యూల్లో మహేష్ బాబు చెప్పడం కూడా జరిగింది. ‘భరత్ అనే నేను’ (Bharat Ane Nenu) ‘మహర్షి’ (Maharshi) ‘సరిలేరు నీకెవ్వరు’ (Sarileru Neekevvaru) ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata) ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) వంటి సినిమాల ఓపెనింగ్స్ కు మహేష్ బాబు హాజరు కాలేదు.కానీ రాజమౌళి సినిమా ఓపెనింగ్ కి.. అదీ పూజా కార్యక్రమాలకి మహేష్ బాబు హాజరయ్యాడు. ఈసారి మాత్రం తన సెంటిమెంట్ ని బ్రేక్ చేశాడు. ఎందుకంటే రాజమౌళి సినిమా అంటే వందకి వంద శాతం హిట్టే అనే నమ్మకం అందరిలోనూ ఉంది.
అయితే ఎంత పెద్ద హిట్ అవుతుంది అనేది మాత్రమే మేటర్. అందుకే రాజమౌళి పై ఉన్న నమ్మకంతో తన సెంటిమెంట్ ను పక్కన పెట్టినట్లు స్పష్టమవుతుంది. ఇక వీరి కాంబినేషన్లో రాబోతున్న సినిమా ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే కథతో రూపొందుతున్నట్లు తెలుస్తుంది. మిగిలిన కాస్ట్ అండ్ క్రూ మెంబర్స్ ను రాజమౌళి ఓ ప్రెస్ మీట్ పెట్టి వెల్లడిస్తారని సమాచారం.