“కేరాఫ్ కంచరపాలెం” సినిమా చూస్తుంటే ఒక గ్రామంలోకి వెళ్లి అక్కడ ఉండే ప్రజలను, అక్కడ జరిగే సంఘటనలను ప్రత్యక్షంగా చూస్తున్న అనుభూతి కలుగుతుంది. అందులోని పాత్రలు కొంతకాలం వరకు ప్రేక్షకులను వెంటాడేలా సినిమా అత్యంత సహజంగా మహా వెంకటేష్ చిత్రీకరించారు. ఎలాంటి కమర్షియల్ హంగులు, ట్విస్టులు లేకుండా సింపుల్‌గా, సున్నితంగా, సహజంగా తీసిన ఈ మూవీ దగ్గుబాటి రానాకీ నచ్చింది. అందుకే అతను విడుదలచేశారు. నిన్న థియేటర్లోకి వచ్చిన ఈ మూవీ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని ముందుగానే చూసిన రాజమౌళి, క్రిష్ తప్పకుండా చూడాల్సిన మూవీ అని సూచించారు.
శేఖర్ కమ్ముల అయితే నిన్న చూసి ఇటువంటి సినిమా ఈ మధ్య తెలుగులో రాలేదని కీర్తించారు. ఈరోజు సినిమాని చూసిన మహేష్ బాబు ట్విట్టర్ వేదికపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. “కేరాఫ్ కంచరపాలెం” లో పాత్రలను డైరక్టర్ మలిచిన తీరు అద్భుతం. కథని ఆసక్తికరరంగా నడిపించారు. క్లైమాక్స్ అయితే సినిమాకి ప్రాణం అయింది. తొలి ప్రయత్నంలోనే మహా వెంకటేష్ అదరగొట్టారు” అంటూ డైరక్టర్ పై అభినందనలు కురిపించారు. అలాగే ఇటువంటి మంచి సినిమాని ప్రోత్సహించిన రానా దగ్గుబాటిని చూసి నిజంగా గర్వపడుతున్నానని ట్వీట్ చేశారు. మొదటి నుంచి అందరితో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీని మహేష్ ప్రసంశించడంతో.. కలక్షన్స్ పెరిగే అవకాశం ఉంది.