కరోనా వైరస్ మహమ్మారి కారణంగా సినిమాల షూటింగ్ షెడ్యూల్స్ మరియు విడుదల తేదీల విషయంలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. మొన్నామధ్య వరుసగా సినిమాల రిలీజ్ డేట్ లను అనౌన్స్ చేశారు టాలీవుడ్ దర్శకనిర్మాతలు. కానీ ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో అసలు అనౌన్స్ చేసిన టైంకి ఆ సినిమాలు విడుదలవుతాయి అన్న గ్యారెంటీ లేదు. పెద్ద, మీడియం రేంజ్ సినిమాలు అన్నిటి విషయంలో ఇదే డైలాగ్ ఎక్కువగా వినిపిస్తుంది. కానీ మహేష్ బాబు సినిమా మాత్రం అనౌన్స్ చేసిన డేట్ కంటే కూడా ముందుగా విడుదలయ్యేందుకు రెడీ అవుతుందట.
ఇది వినడానికి కాస్త విడ్డూరంగాను అలాగే ఆశ్చర్యంగాను అనిపించవచ్చు. కానీ ఇది నిజమే అనేది ఇన్సైడ్ టాక్. ప్రస్తుతం మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ అనే సినిమాలో నటిస్తున్నాడు. పరశురామ్(బుజ్జి) ఈ చిత్రానికి దర్శకుడు. ఇప్పటికే దుబాయ్ లో ఓ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. ఉగాది రోజున రెండో షెడ్యూల్ కూడా మొదలైంది. అయితే ఆగష్టు నెల పూర్తయ్యే టైంకి ఈ చిత్రాన్ని పూర్తి చేసెయ్యాలని చిత్ర యూనిట్ సభ్యులు భావిస్తున్నారట. అక్టోబర్,నవంబర్, డిసెంబర్ నెలల్లో ‘సర్కారు వారి పాట’ విడుదలయ్యే అవకాశం ఉంది.
ఇక వెంటనే త్రివిక్రమ్ డైరెక్షన్లో కూడా తరువాతి సినిమాని మొదలుపెట్టేసి 2022 సమ్మర్ లేదా 2022 ఆగష్ట్ నాటికి విడుదల చేసే విధంగా మహేష్ ప్లాన్ చేసుకుంటున్నాడు. దీంతో రాజమౌళి సినిమా మొదలుపెట్టే లోపు మహేష్ నుండీ రెండు సినిమాలు విడుదలైనట్టు అవుతుంది. ఆ తరువాత 2 లేదా 3 ఏళ్ళ వరకూ మహేష్ సినిమా విడుదలయ్యే అవకాశం ఉండకపోవచ్చు.