ఈ ఏడాది ఎక్కువ కలక్షన్స్ సాధించిన సినిమాలు రంగస్థలం, భరత్ అనే నేను. ఈ సినిమాల తర్వాత రామ్ చరణ్ తేజ్, మహేష్ బాబు చేస్తున్న సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు మించి సినిమాలు ఉండాలని బోయపాటి శ్రీనివాస్, వంశీ పైడిపల్లి ప్రయత్నిస్తున్నారు. అందుకు ఏ మాత్రం తగ్గకుండా వందకోట్లు సైతం ఖర్చుచేయడానికి నిర్మాతలు వెనుకాడడం లేదు. అదే చెర్రీ, మహేష్ లకు ఆందోళన కలిగిస్తోంది. తమపై ఉన్న క్రేజీ తో అనుకున్నదానికన్నా ఎక్కువగా ఖర్చుపెట్టి… ఆ తర్వాత ఫలితం తారుమారు అయితే తలపట్టుకోవడం ఎందుకని కథ గురించి మాత్రమే కాదు ఖర్చుల గురించి కూడా ఆరా తీస్తున్నారు.
ముందుగా బడ్జెట్ ఎంత అనుకున్నారు?, ఇప్పుడు ఎంత అవుతుంది? ఈ సన్నివేశాన్ని ఎంత ఖర్చు అవసరం అనే వాటిపై స్టార్ హీరోలు దృష్టి పెట్టారు. బోయపాటి తన సినిమాలకు ఎక్కువగా ఖర్చు పెడతారనే టాక్ ఉంది. వంశీ కూడా తన గత చిత్రం ఊపిరికి బాగా ఖర్చుపెట్టారని తెలిసిందే. అందుకే రామ్ చరణ్, మహేష్ బాబు నిర్మాణాన్ని అదుపులోకి తీసుకున్నారు. రామ్ చరణ్ నిర్మాతగా మారి… సినిమాలు నిర్మిస్తున్నారు. మహేష్ కూడా తన సినిమాల నిర్మాణంలో భాగస్వాములయ్యారు. కాబట్టి హీరో కష్టాలే కాదు.. నిర్మాతల కష్టాలు కూడా తెలిసి వచ్చాయి. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉంటారని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.