పవన్ కళ్యాణ్ తో ‘అత్తారింటికి దారేది’, అల్లు అర్జున్ తో ‘అల వైకుంఠపురములో’ అనే చిత్రాలను తెరకెక్కించి వాటితో ఇండస్ట్రీ హిట్లు కొట్టాడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. చెప్పాలంటే ఈ రెండు సినిమాల కథ ఒకేలా అనిపిస్తాయి. ఓ కుటుంబం సమస్యల్లో ఉండడం, హీరో సామాన్యుడిలా ఆ కుటుంబానికి దగ్గరవ్వడం. అక్కడి సమస్యలను పరిష్కరించడం.. చివరికి ఆ కుటుంబానికి చెందిన వ్యక్తే అనే విషయాన్ని రివీల్ చేసి వాళ్ళ కంపెనీల్లో సి.ఈ.ఓ గా సెటిల్ అయిపోవడం. అయితే ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది లెండి. ముఖ్యంగా తన సంభాషణలతో త్రివిక్రమ్ మాయ చేసేసాడు.
అందుకే అతన్ని మాటల మాంత్రికుడు అంటుంటారు అనుకోండి అది వేరే విషయం. ఇక అసలు మేటర్ ఏంటంటే.. త్వరలోనే త్రివిక్రమ్.. మహేష్ బాబుతో ఓ సినిమా చెయ్యబోతున్నాడు. అది కూడా ఫ్యామిలీ డ్రామానే..! మన చిరంజీవి గారి ‘మంత్రి గారి వియ్యంకుడు’ టచ్ ఉంటుందట. అంతేకాకుండా ‘అత్తారింటికి దారేది’ కి పొలిటికల్ ఎలిమెంట్స్ ను జోడిస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా కూడా అలా ఉండబోతుందట. ఈ మధ్య కాలంలో మహేష్ బాబు నటిస్తున్న ప్రతీ సినిమాలోనూ ఓ సామజిక అంశాన్ని టచ్ చేస్తూ వస్తున్నాడు.ఇప్పుడు త్రివిక్రమ్ కూడా అలాంటి అంశాన్ని ఇందులో జోడించబోతున్నాడట.
ఓ వైపు నవ్విస్తూనే మరోపక్క అందరినీ ఆలోచింపజేసే చక్కని మెసేజ్, అభిమానులకు కావాల్సిన యాక్షన్ ఇలా అన్ని అంశాలు కూడా ఈ సినిమాలో ఉంటాయట. దాంతో ‘అత్తారింటికి దారేది’ ‘భరత్ అనే నేను’ సినిమాలను మిక్స్ చేసినట్టు ఈ కథ ఉంటుందని ఫిలింనగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మే 31న అంటే కృష్ణ గారి పుట్టినరోజు నాడు ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ప్రస్తుతం మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ షూటింగ్లో పాల్గొంటున్నాడు.