కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సమయంలో థియేటర్లు మూతబడటంతో టాలీవుడ్ ప్రేక్షకులు ఓటీటీల వైపు ఆకర్షితులయ్యారు. సబ్ టైటిల్స్ ద్వారా ఇతర భాషల సినిమాలను కూడా తెలుగు ప్రేక్షకులు చూస్తున్నారు. మరోవైపు రీమేక్ సినిమాలను ప్రేక్షకులు ఒరిజినల్ తో పోల్చి చూస్తున్నారు. రీమేక్ మూవీలో చేసిన మార్పులు సినిమాకు ప్లస్ కాకపోయినా, రీమేక్ సినిమాలలో పెద్దగా మార్పులు చేయకపోయినా ఆ సినిమా మేకర్స్ ను నెటిజన్లు తీవ్రస్థాయిలో ట్రోల్ చేస్తున్నారు.
వెంకటేష్ హీరోగా నటించి విడుదలైన నారప్ప మూవీ రీమేక్ కావడంతో ప్రేక్షకుల నుంచి ఆ సినిమా గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసురన్ చూడని ప్రేక్షకులు సినిమా బాగానే ఉందని చెబుతున్నా చూసిన ప్రేక్షకులు మాత్రం నారప్ప కంటే అసురన్ బాగుందని కామెంట్లు చేస్తున్నారు. నారప్ప సినిమా రిజల్ట్ వల్ల మెగా ఫ్యాన్స్ తెగ కంగారు పడుతున్నారు. చిరంజీవి లూసిఫర్, వేదాళం రీమేక్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
లూసిఫర్ స్క్రిప్ట్ లో దర్శకుడు మోహన్ రాజా ఇప్పటికే చాలా మార్పులు చేశారని వార్తలు వచ్చినా ఆ మార్పులు సినిమాకు ప్లస్ అవుతాయో లేదో చూడాల్సి ఉంది. రీమేక్ సినిమాలు థియేటర్లలో రిలీజైతే భారీ స్థాయిలో కలెక్షన్లు సాధించడం కష్టమేనని కామెంట్లు వినిపిస్తున్నాయి. చిరంజీవి రీమేక్ సినిమాలకు భవిష్యత్తులో దూరంగా ఉంటే మంచిదని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. మెగాస్టార్ రీమేక్ సినిమాల విషయంలో నిర్ణయాన్ని మార్చుకుంటారో లేదో చూడాల్సి ఉంది.