టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చాలా ఏళ్ల క్రితం ‘జనగణమన’ అనే సినిమా తీయబోతున్నట్లు మీడియా వేదికగా వెల్లడించారు. మహేష్ బాబు ‘బిజినెస్ మెన్’ సినిమా విడుదలైన సమయంలో ఈ సినిమా కథ గురించి మాట్లాడారు పూరి. మహేష్ బాబుతోనే ‘జనగణమన’ చేయాలనుకున్నారు. దీనికి సంబంధించి ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. కానీ మహేష్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. ఆ తరువాత పవన్ కళ్యాణ్, చిరంజీవిల పేర్లు వినిపించాయి.
వారితో పూరి సినిమా చేసే ఛాన్స్ ఉందని అన్నారు. ఇలా చాలా ఏళ్లుగా ‘జనగణమన’ సినిమా వార్తల్లోఉంటోంది . అయితే ఈ టైటిల్ పై వేరేవాళ్ల దృష్టి పడినట్లుంది. వెంటనే టైటిల్ ను రిజిస్టర్ చేయించేశారు. మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. ఆ సినిమా పేరు ‘జనగణమన’. మరి వారు ఏయే భాషలకు ఈ టైటిల్ ను రిజిస్టర్ చేయించుకున్నారో.. కానీ పూరి సినిమా టైటిల్ మాత్రం మారింది.
విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ అనౌన్స్ చేసిన సినిమాకి ‘జేజీఎం’ అంటూ టైటిల్ లోగోను వదిలారు. పూరి సినిమా మొదలుపెట్టేసరికి వేరే భాషలో ‘జనగణమన’ టైటిల్ తో సినిమా తెరకెక్కుతుండటం విశేషం. ఇదిలా ఉండగా.. అసలు ‘జనగణమన’ అనే పేరుతో సినిమాలు తీయచ్చా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జాతీయగీతాన్ని ఇలా సినిమా టైటిల్ కోసం వాడుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించేవారు కూడా ఉన్నారు. గతంలో బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ హీరోగా ఓ సినిమా వచ్చింది.
జర్నలిజం బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ఆ సినిమాలో ఓ పాటలో జనగణమనను చరణంగా వాడేశారు. ఆ సమయంలో సినిమాపై చాలా మంది ఫిర్యాదులు చేశారు. ఇప్పుడు ఏకంగా సినిమాకి టైటిల్ గా ‘జనగణమన’ను పెడుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి!