‘విశ్వంభర’ సినిమాకు ఎవరూ ఊహించనంత హైప్ ఉండేది, సినిమా పోస్టర్, కాన్సెప్ట్, చేసుకున్న సెటప్, టెక్నీషియన్స్, నటీనటులు ఇలా చాలా విషయాలు దీనికి కారణం. అయితే ఆ హైప్ అంతా ఒక్క టీజర్‌తో పడిపోయింది. ఆ తర్వాత సినిమా టీమ్ పునరాలోచనలో పడింది. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో హీరో చిరంజీవి, దర్శకుడు మల్లిడి వశిష్ట చాలా పట్టింపుతో ఉన్నారు అందుకే సినిమా లేట్ అవుతోంది అని చెబుతున్నారు. దీంతోపాటు టీజర్ వచ్చాక వచ్చిన మరో ఇబ్బంది.. ‘ఈ సినిమా ‘అవతార్’కి కాపీలా ఉంది’ అని. తాజాగా ఈ మాటలపై వశిష్ట క్లారిటీ ఇచ్చారు.
చిరంజీవి కథానాయకుడిగా.. త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా రూపొందుతున్న ఈ సినిమాను మల్లిడి వశిష్ట సోషియో ఫాంటసీ సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పనులు కొలిక్కి వచ్చాయి అని వార్తలొస్తున్న నేపథ్యంలో వశిష్ట వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో టీజర్ గురించి కొన్ని ఆసక్తికర కామెంట్లు చేశారు. టీజర్ నచ్చింది కాబట్టి రిలీజ్ చేశాను అని కాస్త ఘాటుగానే చెప్పారాయన. ఇక టీజర్‌లో కనిపించిన పాప కాస్ట్యూమ్, వెనుక కనిపించిన కొండలు చూసి కొందరు ‘అవతార్’ సినిమా కాపీ చేసి సినిమా తీస్తున్నా అని కామెంట్లు చేశారు అని అన్నారు.
నిజానికి అలాంటి కొండలను ‘అవతార్’ సినిమా కంటే ముందు ఎన్నో సినిమాల్లో చూపించారని, చెవులు పెద్దగా ఉండడం గతంలో చాలా సినిమాల్లో చూశామని గుర్తు చేశారు. తాను చందమామ కథల స్ఫూర్తితో ఆ కాస్ట్యూమ్ డిజైన్ చేయించానని చెప్పారు వశిష్ట. అందుకే ‘అవతార్’ చూసి కాపీ కొట్టాను అనే బదులు చందమామ కథలను చూసి కాపీ కొట్టాను అంటే చాలా ఆనందించేవాడిని అని అన్నారు. ఇక చందమామ కథల్లో జ్వాలా దీపం అనే సిరీస్‌లో ఉన్నవే ‘అవతార్’ సినిమాల్లో ఉన్నాయని వశిష్ట గుర్తు చేశారు.