టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు (Mohan Babu) , మంచు మనోజ్ (Manchu Manoj) మధ్య ఆస్తుల పంపకాల విషయంలో గొడవలు జరుగుతున్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా యూనివర్సిటీ విషయంలో మంచు మనోజ్ వాటా అడిగితే మోహన్ బాబు అందుకు నిరాకరించాడని, అప్పటినుంచి వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలుస్తోంది. మంచు విష్ణుకి (Manchu Vishnu) మాత్రమే యూనివర్సిటీలో వాటాలు ఉన్నట్లు మోహన్ బాబు స్పష్టం చేశాడట. ఇందులో నిజం ఎంతుందో తెలియదు, కానీ ఈ గొడవల్లో భాగంగా మోహన్ బాబు తన అనుచరుడు వినయ్, ఇతర బౌన్సర్లతో మంచు మనోజ్, అతని భార్య మౌనిక పైన దాడి చేయించినట్లు నిన్నంతా వార్తలు గుప్పుమన్నాయి.
Manchu Lakshmi
మనోజ్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదులు చేసినట్లుగా కూడా రిపోర్ట్స్ వచ్చాయి. మంచు ఫ్యామిలీ ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో చిక్కుకుపోయిన వేళ మంచు లక్ష్మి (Manchu Lakshmi) చేసిన ఒక పని ఇప్పుడు అందరినీ షాక్‌కి గురి చేస్తోంది. ఒకవైపు తండ్రీకొడుకులు గొడవలు పడుతుంటే మంచు లక్ష్మి మాత్రం హైదరాబాద్ నగరాన్ని విడిచి వెళ్లిపోయింది. ఈ విషయాన్ని ఆమె తెలిపింది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ స్టోరీస్‌లో ఒక వీడియో షేర్ చేసింది. అందులో హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఆమె నడుచుకుంటూ వెళ్లిపోతున్నట్లు కనిపించింది.
అంతేకాదు ఈ వీడియో కింద “బై హైదరాబాద్” అని కూడా రాసింది. మరోవైపు మంచు మనోజ్, మోహన్ బాబు ఎవరికివారు తమ రెసిడెన్సీల ముందు పదుల సంఖ్యలో బౌన్సర్లను నియమించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇద్దరూ ఒకరి నుంచి ఒకరికి ప్రమాదం ఉందని బాగా భయపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ గొడవ జరుగుతున్నప్పుడు మంచు విష్ణు యూఎస్‌లో ఉన్నాడని సమాచారం. అయితే విషయం తెలియగానే అతను ఇండియాకి రిటర్న్ అయినట్టుగా తెలుస్తోంది, అతను ఇంటికి వచ్చాక ఈ గొడవ ఎటు వెళ్తుందో చూడాలి.
అయితే మోహన్ బాబు వారసులలో అందరికంటే పెద్దదైన మంచు లక్ష్మి వెళ్లిపోవడమే ఇప్పుడు అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. వాస్తవానికి తన ఇద్దరు తమ్ముళ్లయిన విష్ణు, మనోజ్ అంటే లక్ష్మికి చాలా ఇష్టం. తండ్రికి కూడా చాలా క్లోజ్ గా ఉంటుంది. ఇప్పుడు వారందరూ పోట్లాడుకుంటుంటే ఈమె ఇక్కడే ఉండి అందరికీ సర్దిచెప్పాల్సిన అవసరం ఉంది. పరిస్థితులు హింసాత్మకంగా మారకుండా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఆమెకు ఉంది.
అయితే రిపోర్ట్స్ ప్రకారం చాలా రోజులుగా మంచు లక్ష్మి ఈ గొడవలను పరిష్కరించాలని ప్రయత్నించిందట. కానీ ఎవరూ ఆమె మాట వినకుండా, మొండి పట్టుదలతో ఉన్నారట. చివరికి ఆమె వీరిని వదిలేసినట్లుగా తెలుస్తోంది. పరిస్థితి తన చేయి దాటిపోయిందని తెలుసుకున్న తర్వాతే మంచు లక్ష్మి సైలెంట్ గా హైదరాబాద్ నుంచి వెళ్లిపోయిందనేది కొందరి అభిప్రాయం.