కరోనా కాలంలో ఇబ్బందులు పడుతున్న దివ్యాంగుల కోసం మంచు లక్ష్మీప్రసన్న బృహత్ కార్యం చేపట్టబోతోంది. ఏకంగా 100 కిలోమీటర్లు సైకిల్ తొక్కి విరాళాలు సేకరించాలని నిర్ణయించింది. ఈ నెల 28న ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. క్రీడా రంగంలో రాణించాలనుకుంటున్న దివ్యాంగులకు సాయంగా ఈ ప్రయత్నం చేస్తున్నట్లు మంచు లక్ష్మి ప్రకటించింది. తండ్రి మంచు మోహన్‌బాబు కుటుంబంతో కలసి ఇటీవల మంచు లక్ష్మి కుటుంబం మాల్దీవులు విహార యాత్రకు వెళ్లిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగానే ఆమెకు ఈ విరాళాల సేకరణ ఆలోచన వచ్చిందట. మేం మాల్దీవుల్లో చాలా ఆనందంగా గడిపాం. అదే సమయంలో చాలామంది కరోనా కారణంగా కుదేలైపోయారు. ముఖ్యంగా దివ్యాంగులు. పుట్టుకతోనే కొందరు అలా ఉంటే, ఇంకొందరు మధ్యలో వివిధ కారణాల వల్ల దివ్యాంగులుగా మారారు. వారి కోసం ఏదైనా చేయాలనిపించింది. దివ్యాంగులకు సాయం చేసే చాలా సంస్థలు కరోనా సమయంలో ఇబ్బందుల్లోకి వెళ్లిపోయాయి. సరైన విరాళాలు రాక ఆందోళనకర పరిస్థితులు వచ్చాయి. అందుకే వారి కోసం విరాళాల సేకరణ చేపడుతున్నాను.
అందరికీ స్ఫూర్తి నింపేలా ఉండటానికి 100 కిమీల సైక్లింగ్ చేయబోతున్నాను. ప్రజల్లో అవగాహన పెంచడానికి నా ప్రయత్నం ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఆదిత్య మెహతా ఫౌండేషన్ కోసం మంచు వారమ్మాయి ఈ పని చేస్తోంది. గత కొంత కాలంగా ఆమె ఈ స్వచ్ఛంద సంస్థతో కలసి సేవా కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలిసిందే.