ఇటీవల ‘త్రిబాణధారి బార్బరిక్’ అనే సినిమా వచ్చింది. ఆ సినిమాకి టాక్ పర్వాలేదు అనిపించే విధంగా వచ్చినా.. జనాలు థియేటర్ కి రాలేదు. ఈ సినిమా కనుక ఆడకపోతే ‘చెప్పుతో కొట్టుకుంటా’ అంటూ దర్శకుడు మోహన్ రిలీజ్ కి ముందు స్టేట్మెంట్ పాస్ చేశాడు. రిలీజ్ తర్వాత నిజంగానే దర్శకుడు ‘చెప్పుతో కొట్టుకుంటూ’ ఓ వీడియోను వదిలాడు. అది సంచలనం అయ్యింది.
దీనిపై తాజాగా దర్శకుడు మారుతి రియాక్ట్ అయ్యాడు. ‘బార్బరిక్..’ దర్శకుడిపైనే కాకుండా ఇలా ఓపెన్ ఛాలెంజ్..లు చేసే వాళ్లపై మండిపడుతూ క్లాస్ పీకాడు.
మారుతి మాట్లాడుతూ.. “నిర్మాత విజయ్ పాల్ రెడ్డి గారు ‘త్రిబాణధారి బార్బరిక్’ అనే మంచి సినిమా తీశారు. డైరెక్టర్ కూడా చాలా మంచి డైరెక్టర్. కానీ ‘త్రిబాణధారి బార్బరిక్’ అనే టైటిల్ జనాలకు అర్థమయ్యేలా లేదు. ‘బార్బీ క్యూ’ అనే సౌండింగ్ వస్తుంది. ఒకసారి ఆలోచించు అని 100 సార్లు చెప్పాను. నేను 100 టైటిల్స్ రిఫర్ చేశాను. చెబితే అర్థం కాదేమో అని భావించి.. లోగోస్ డిజైన్ తో పంపించాను.
అయినా సరే దర్శకుడు మోహన్ అర్థం చేసుకోలేదు. అతను ఒక ట్రాన్స్ లో ఉండేవాడు. ‘బార్బరిక్’ అంటే దేవుడు అనుకున్నాడు. తప్పేమీ లేదు. కానీ ఆడియన్ కి అది అర్థం కాకపోతే అక్కడే వస్తుంది అసలు సమస్య. ఒక డైరెక్టర్ గా ఇంకో డైరెక్టర్ క్రియేటివిటీని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని భావించి నేను ఇక ఫోర్స్ చేయలేదు. కానీ మంచి సినిమా తీసి మరీ అతను చెప్పుతో కొట్టుకున్నాడు.
అది చూసి నాకు చాలా బాధేసింది. దయచేసి అలాంటి పిచ్చి పనులు చేయకండి. ఆడియన్స్ ని థియేటర్ కి రప్పించడానికి చాలా మంది పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. బూతులు మాట్లాడుతున్నారు, చొక్కా తీసుకుని తిరుగుతాం అంటున్నారు. కాంట్రోవర్సీలు మాట్లాడితే, బూతులు మాట్లాడితే జనాలు వస్తారనేది ఓ స్ట్రాటజీ. కానీ ‘ఈరోజుల్లో’ ‘బస్ స్టాప్’ వంటి సినిమాలు తీసినప్పుడు నాకు బూతు డైరెక్టర్ అనే పేరు వచ్చింది. నేను అలాంటి స్ట్రాటజీలు వాడటం మొదలుపెడితే నాకంటే బూతులు బాగా ఎవ్వరూ రాయరు” అంటూ గట్టిగానే క్లాస్ పీకాడు.