పవన్ కల్యాణ్‌కు, జనసేన పార్టీకి మెగా ఫ్యామిలీ సపోర్టు ఉందా? ఏంటీ ప్రశ్న.. కచ్చితంగా ఉంది అని అంటారా? అయితే మేం అనేది నేరుగా కాదు.. సినిమాల రూపంలో ఉందా? అని. అయితే ఏమో ఉండొచ్చు అనే సమాధానం వస్తుంది. అయితే డౌట్‌ఫుల్ ఆన్సర్‌ను పక్కా ఆన్సర్ చేసేలా ఓ విషయం కనిపిస్తోంది. అదే మెగా ఫ్యామిలీ సినిమాల్లో రాజకీయం. అంటే తమ సినిమాల్లో మెగా హీరోలు రాజకీయం చేసినప్పుడు.. అందులో కచ్చితంగా జనసేన పార్టీ గుర్తులు, పేర్లకు దగ్గర పేర్లు కనిపిస్తున్నాయి.
రామ్‌చరణ్ – శంకర్ సినిమాకు సంబంధించి గత కొన్ని రోజులుగా కొన్ని ఫొటోలు బయటకు వస్తున్నాయి. రామ్‌చరణ్ అతని కుటుంబ సభ్యులు కొందరు కలసి అభ్యుదయం అనే పార్టీ పెట్టారని, దాని కోసం రామ్‌చరణ్ రాష్ట్రం మొత్తం తిరిగి ప్రచారం కూడా చేశారు అని సమాచారం. ఈ మేరకు షూటింగ్ జరిగింది, ఇంకాస్త మిగిలి ఉంది కూడా. అయితే ఇక్కడ సమస్య అంతా అది కాదు. ఆ పార్టీ గుర్తు. అభ్యుదయం పార్టీ సింబల్‌గా టీమ్ రెండు పిడికిళ్లు కలిసిన చేతుల గుర్తు వాడారు.
నిజ రాజకీయంలో చూస్తే.. పవన్ కల్యాణ్ జనసేన పార్టీ జనాల్లోకి బలంగా వెళ్లింది అంటే అది పిడికిలి గుర్తుతోనే. చెయ్యెత్తి బలంగా పిడికిలి చూపించే పవన్ ఫొటోలు సోషల్ మీడియాలో ముఖ్యంగా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్, జనసేన కార్యకర్తల ట్విటర్ హ్యాండిల్స్ కనిపిస్తాయి. ఇప్పుడు చరణ్ పార్టీ గుర్తు కూడా దానికి దగ్గరగా ఉండటం గమనార్హం. దీంతో కావాలనే సినిమాలో ఆ గుర్తు పెట్టారా అనే డౌట్ వస్తోంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మొన్నీమధ్యే చిరంజీవి కూడా ఇదే పని చేశారు.
‘గాడ్‌ఫాదర్’ సినిమాలో చిరంజీవి ఉండే పార్టీ జేజేపీ.. అంటే జన జాగృతి పార్టీ. గుర్తు రెండు పిడికిళ్లు. ఆ సమయంలో పార్టీ పేరు, గుర్తు.. జనసేనకు దగ్గరగా ఉన్నాయి కదా అనే చర్చ జరిగింది. దానికి అప్పుడు చిరంజీవి ఏదో అలా అనుకోకుండా అయిపోయింది అని అన్నారు. ఇప్పుడు చరణ్ కూడా ఏదో అలా అనుకోకుండా ఇలాంటి గుర్తు పెట్టారా? అంటే ఏమో అనాలి. ఇదంతా చూస్తుంటే చిరంజీవి కుటుంబం పవన్‌కు ఇలా పొలిటికల్ సపోర్టు చేస్తుందా? అనే చర్చకు ఈ గుర్తులు దారి తీస్తున్నాయి అని చెప్పాలి.