ఎంచుకున్న రంగాలలో ఉన్నత స్థాయికి చేరిన వ్యక్తుల జీవితాలు బయోగ్రఫీలుగా, ఆటో బయోగ్రఫీలుగా రావడం అనేది సర్వసాధారణం. సక్సెస్ ఫుల్ పీపుల్, లెజెండ్స్ జీవితాలు పుస్తకాలు, సినిమాలు, సిరీస్ లుగా రావడం మంచి పరిణామమే. అనేక మందికి వీరి జీవిత కథలు స్ఫూర్తి నింపుతాయి. విజయం కొరకు పోరాడే శక్తిని అందిస్తాయి. కాగా టాలీవుడ్ చరిత్రలో మెగాస్టార్ చిరంజీవిది అలాంటి జీవితమే. ఓ సామాన్య వ్యక్తి నుండి నటుడు, హీరో, సుప్రీం హీరో, స్టార్ హీరో నుండి మెగాస్టార్ గా ఎదిగిన ఘన చరిత్ర ఆయనది.
స్వయం కృషి, పట్టుదలతో చిరంజీవి చిత్ర పరిశ్రమలలో అంచలంచెలుగా ఎదిగారు. ఎన్టీఆర్, ఏ ఎన్ ఆర్ తరువాత టాలీవుడ్ కింగ్ గా ఎదిగిన చిరంజీవి ఆ స్థానాన్ని దశాబ్దాలుగా నిలబెట్టుకుంటూ వస్తున్నారు. కాగా చిరంజీవి తన ఆటోబయోగ్రఫీ రాసుకుంటున్నారట. కెరీర్ ప్రారంభం నుండి, నటుడిగా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించడం, హీరో కావడానికి ఎదుర్కొన్న ఒడిదుడుకులు, ఆయన చూసిన విజయాలు వంటి అనేక ముఖ్య సంఘటనల సమాహారంగా ఆయన తన జీవిత కథ స్వయంగా రాసుకుంటున్నారట.
అలాగే కొన్ని ముఖ్య సంఘటనల వీడియో ఫుటేజ్ లను కూడా ఆయన సేకరించే పనిలో ఉన్నారట. కరోనా వైరస్ కారణంగా నిర్బధంలో ఉన్న చిరు తన జీవిత చరిత్రను ఆసక్తికరంగా సంగ్రహించి… రాసుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ విషయాలను చిరంజీవి స్వయంగా ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు. చాలా కాలంగా చిరంజీవి బయోపిక్ పై వార్తలు వస్తున్నాయి. ఎదో ఒక రోజు ఇది పట్టాలెక్కడం ఖాయం, సదరు దర్శకులకు చిరంజీవి వద్ద ఉన్న సమాచారం బాగా ఉపయోగపడనుంది.