మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డారు. కొరటాల శివ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా పూర్తయిన వెంటనే చిరు ‘లూసిఫర్’ రీమేక్ ని పట్టాలెక్కించబోతున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను మెగాస్టార్ రీమేక్ చేస్తుండడం విశేషం. అయితే ఈ సినిమాలో మలయాళ ఫ్లేవర్ ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే కథలో మార్పులు చేసి తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా స్క్రిప్ట్ తయారు చేస్తున్నారు.
ఒరిజినల్ తో పోలిస్తే కథలో కీలకమైన మార్పులు చేసినట్లు తెలుస్తోంది. నిజానికి మాతృకలో మోహన్ లాల్ పక్కన హీరోయిన్ కనిపించదు. తెలుగులో చిరంజీవి ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని.. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకి చోటు కల్పించారని ప్రచారం జరుగుతోంది. అయితే నిజానికి తెలుగు వెర్షన్ లో కూడా హీరోయిన్ ఉండదట. చిరు కోసం హీరోయిన్ ని తీసుకోవాలని దర్శకుడు మోహన్ రాజా భావించినప్పటికీ.. చిరంజీవి మాత్రం తనకు హీరోయిన్ వద్దని చెప్పారట.
ఈ విషయంలో ఒరిజినల్ వెర్షన్ ని ఫాలో అవుదామని మోహన్ రాజాకి సలహా ఇచ్చారట. ఇప్పటివరకు చిరు నటించిన చిత్రాల్లో హీరోయిన్ లేకుండా వస్తోన్న సినిమా ఇదే కావొచ్చు. అలానే ‘లూసిఫర్’ ఒరిజినల్ వెర్షన్ లో మరో హీరోకి స్కోప్ ఉంది. కానీ తెలుగు రీమేక్ కి వచ్చేసరికి.. ఆ పాత్రని పూర్తిగా పక్కన పెట్టేశారని.. కేవలం చిరంజీవిపైనే కథ మొత్తం నడిపిస్తున్నారని తెలుస్తోంది. దాదాపు ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. ఏప్రిల్ రెండు వారంలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లాలని చూస్తున్నారు.