ప్రభాస్ (Prabhas) సినిమా కాస్టింగ్ విషయంలో హను రాఘవపూడి (Hanu Raghavapudi) చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే ఈ సినిమాను అంతకుమించి అనే రేంజిలో సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో హీరోయిన్ విషయంలో సర్‌ప్రైజ్ చేసిన హను.. ఇప్పుడు మరో ముఖ్య పాత్రధారి విషయంలోనూ సర్‌ప్రైజ్ చేశారు. అంతేకాదు ఆ విషయాన్ని అనౌన్స్ చేయడంలోనూ స్పెషల్ డేను ఎంచుకున్నారు. ప్రభాస్ సినిమా అంటే ఇప్పుడు భారీతనం మినిమం అయిపోయింది. ఆయన చేస్తున్న సినిమాలు, అవి సాధిస్తున్న విజయాలు, అందుకుంటున్న వసూళ్లే దానికి కారణం.
Prabhas
ఈ క్రమంలో కొత్త సినిమా విషయంలో అన్నీ అలానే ఉండేలా చూసుకుంటున్నారు హను రాఘవపూడి. ‘ఫౌజీ’ అనే పేరు పెడతారు అంటున్న ఆ సినిమాలో కాస్టింగ్‌లో కొత్త పేరుగా మిథున్ చక్రవర్తిని (Mithun Chakraborty) జోడించారు. హీరోయిన్‌గా యూట్యూబర్ ఇమాన్వి ఇస్మాయిల్‌ను ఎంపిక చేసిన ఆయన.. మరో పాత్ర కోసం సీనియర్ నటి జయప్రదను తీసుకున్నారు. ఇప్పుడు అలాంటి స్టెప్పే వేశారు. ఎందుకంటే మిథున్ సినిమాల ఎంపిక చాలా డిఫరెంట్‌గా ఉంటుంది.
అలాగే ఆయన పాత్రల చిత్రణ కూడా. అలాంటి ఆయనను సినిమా కోసం ఓకే చేయించారు అంటే కథలో ఏదో మ్యాజిక్ ఉంది అని చెప్పొచ్చు అని కామెంట్స్ వస్తున్నాయి. గతంలో ఆయన తెలుగులో ‘గోపాల గోపాల’ (Gopala Gopala) సినిమాలో దొంగ బాబాగా నటించారు. ఆ పాత్రలోనే ఆయన బాడీ లాంగ్వేజ్, నటన అదిరిపోయాయి. ఇప్పుడు మరి ప్రభాస్ సినిమాలో ఎలాంటి పాత్రలో కనిపిస్తారో చూడాలి. ఇక మిథున్ చక్రవర్తికి తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్ పాల్కే అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే.
సినీ రంగానికి సంబంధించి ప్రతిష్ఠాత్మకంగా భావించే అవార్డును ఆయనకు అక్టోబర్ 8న జరగనున్న జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో అందిస్తారు. మిథున్ చక్రవర్తి అద్భుతమైన సినీ ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. భారతీయ చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలను గుర్తించి దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం అందించాలని జ్యూరీ నిర్ణయించింది అని కేంద్ర, సమాచార మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు.