సినిమాకు సీక్వెల్ అంటే.. అంచనాలు రెట్టింపు అవుతాయి. అయితే మైత్రీ మూవీ మేకర్స్ దాంతోపాటు బడ్జెట్‌ను కూడా భారీగా పెంచేసింది. మీరు అనుకుంటున్నది కరెక్టే.. మేం చెబుతున్నది ‘పుష్ప 2’ సినిమా గురించే. ఇటీవల పూజా కార్యక్రమాలతో ‘పుష్ప ది రూల్’ అధికారికంగా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో సినిమా బడ్జెట్, రెమ్యూనరేషన్ లెక్కలు ఇవే అంటూ కొన్ని వినిపిస్తున్నాయి. వాటి ప్రకారం చూస్తే.. ఈ సినిమా మీద మైత్రీ టీమ్ భారీగా ఆశలు పెట్టుకుంది అనిపిస్తోంది.
‘పుష్ప’ సినిమా విజయం సాధిస్తుంది అని తెలుసు కానీ.. మరీ బాలీవుడ్ రూ. 100 కోట్లకుపైగా వసూలు చేస్తుంది అని ఎవరూ అనుకోలేదు. రోజులు గడుస్తున్నా ‘జూకేగా నహీ’ అంటూ ‘పుష్ప’రాజ్ దూసుకుపోయాడు. ఇక సౌత్‌లో వసూళ్ల సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ లెక్కలన్నీ చూసుకున్న నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ‘పుష్ప 2’ కోసం ఏకంగా రూ. 300 కోట్ల నుండి రూ. 350 కోట్ల వరకు బడ్జెట్ పెడుతోందని అంటున్నారు. దీనిపై అధికారిక సమాచారం లేకపోయినా ఊహాగానాలు అయితే నడుస్తున్నాయి.
ఒకవేళ ఈ బడ్జెట్ నిజమైతే.. ‘ఆర్ ఆర్ ఆర్’ తరవాత అంత భారీ బడ్జెట్‌తో రూపొందనున్న సినిమా ‘పుష్ప ది రూల్’ అవుతుంది. ఈ సినిమా కోసం దర్శకుడు సుకుమార్ ఏకంగా రూ.50 కోట్లు అందుకుంటున్నారని సమాచారం. అయితే ఇది సినిమా నిర్మాణంలో వాటా రూపంలో అందుతుంది. ఎందుకంటే ఈ సినిమా నిర్మాతల్లో ఆయన కూడా ఉన్నారు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ మీద ఈ సినిమా నిర్మాణంలో ఆయన భాగస్వామి అయ్యారు.
ఇక హీరో అల్లు అర్జున్‌కి రూ.100 కోట్ల వరకు ఇస్తున్నారని సమాచారం. పారితోషికం, సినిమా వసూళ్లలో వాటా కలిపి అంత మొత్తంలో అందుతుందని చెబుతున్నారు. దీంతో వీరిద్దరికే రూ. 150 కోట్ల వరకు అయిపోయింది. మిగిలిన బడ్జెట్‌తో మిగిలిన నటులు, సాంకేతిక నిపుణుల పారితోషికాలు లెక్క తేలుస్తారట. అయితే ఇంతమొత్తం పెడుతుండటంతో అంతే మొత్తం వెనక్కి తెప్పించుకునేలా ఇప్పటినుండే ప్రయత్నాలు కూడా సాగుతున్నాయట.
‘పుష్ ది రూల్’ వసూళ్లు సుమారు రూ. 500 కోట్లు నుండి రూ. 550 కోట్లు ఉండొచ్చిన అంచనా వేస్తున్నారట. థియేట్రికల్, ఓటీటీ రైట్స్ ద్వారానే ఇందులో సగం సంపాదించే పనిలో ఉందట చిత్రబృందం. దాంతోపాటు వివిధ ప్రాంతాల నుండి అప్పుడే బయ్యర్ల దగ్గర నుండి అడ్వాన్స్‌లు కూడా తీసుకునే పనిలో ఉన్నారట.