నాగశౌర్య సారీ చెప్పాడు. అవును బహిరంగంగా సినిమా ప్రెస్ మీట్‌లోనే సారీ చెప్పాడు. దేని గురించి సారీ చెప్పాడు అనే విషయం మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. అవును మీరు అనుకుంటున్నది కరెక్టే. స్పూఫ్ ఇంటర్వ్యూల గురించి ఈ మాట చెప్పాడు. శౌర్య తాజా చిత్రం ‘రంగబలి’ కోసం కమెడియన్ సత్యతో ఓ స్పూఫ్ ఇంటర్వ్యూను చేయించారు. టీజర్‌తోనే సినిమా మీడియాలో కొంతమందికి మంట పుట్టించిన ఆ ఇంటర్వ్యూ రెండు పార్టులుగా వచ్చి మరింత మంట రేపింది. అయితే నరేశ్ మండేటి ఒరిజినల్ వ్యక్తి తప్ప ఇంకెవరూ డైరెక్ట్‌గా స్పందిచంలేదు.
అయితే ఇప్పుడు నాగశౌర్య (Nag Shaurya) మాత్రం ఆ పంచావతారం స్పూఫ్ వీడియో గురించి మాట్లాడాడు. సినిమా ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ బాధపడి ఉంటే సారీ అని చెప్పుకొచ్చాడు. ఆ వీడియో ఎవరినో ఎగతాళి చేయడానికి రూపొందించలేదంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అంతేకాదు ఇది ఎగతాళి కూడా కాదు అని అన్నాడు. దీంతో చేసిందంతా చేసి ఇప్పుడు ఎగతాళి కాదంటే ఎలా అంటూ కొన్ని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.
‘రంగబలి’ సక్సెస్ మీట్ సందర్భంగా శౌర్య ఈ మాట అన్నాడు. ‘మీడియాపై సెటైర్ వేయాలని ఎందుకు అనిపించింది?’ అని మీడియా పర్సన్స్ అడగ్గా, మీడియా మేమూ ఒకటే ఫ్యామిలీ. సినిమా ప్రమోషన్స్ కోసం అందరికీ తెలిసిన వ్యక్తులను ఎంపిక చేసుకున్నాం. ఒక హీరోను వాళ్లు తమ శైలిలో ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుంది అనే విషయాన్ని సరదాగా చూపించాం. ఇందులో ఎవరినీ ఎగతాళి చేయలేదు. మా వీడియో వల్ల ఎవరైనా బాధపడితే ‘క్షమించండి’ అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు శౌర్య
మా వీడియో వల్ల ‘ఒకరిద్దరు బాధపడ్డారు’ అని వేరే వాళ్లు ప్రచారం చేయడం వల్ల ఆ న్యూస్ ట్రెండ్ అయింది అని నాగశౌర్య ఇంకాస్త డీప్‌గా విషయంలోకి వెళ్లాడు. అయితే ఆ ఒకరిద్దరు ఎవరు అనేది చెప్పలేదు. అన్నట్లు ఈ వీడియోలో తెలుగు మీడియా నుండి ఐదుగురు వ్యక్తుల్ని తీసుకొని చేశారు.