కొన్ని కాంబినేషన్ల గురించి వినడానికి చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఇద్దరూ కలిస్తే మంచి సినిమా పక్కా అనే నమ్మకం కలగడమే. ఇండస్ట్రీలో ఇలాంటి కాంబోల్లో నాగచైతన్య (Naga Chaitanya) – చందు మొండేటి (Chandoo Mondeti) ఒకటి. ‘తండేల్’ (Thandel) సినిమాతో రీసెంట్‌గా భారీ విజయం అందుకున్న జోడీ ఇది. ఇప్పుడు మరోసారి ఇద్దరూ కలసి ఓ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈసారి ఓ సినిమా రీమేక్ చేయబోతున్నారు. అది కూడా ఇప్పటిది కాదు. 69 ఏళ్ల క్రితం సినిమా.
‘తండేల్’ సినిమా సక్సెస్ మీట్‌లో భాగంగా దర్శకుడు చందు మొండేటి మాట్లాడుతూ తమ కాంబినేషన్‌లో మరో సినిమా ఉంటుందని ప్రకటించారు. భారతీయ చరిత్రలో మేలిమి రత్నాల్లో ఒకటైన ‘తెనాలి రామకృష్ణ’ సినిమాను ఇప్పుడు రీమేక్ చేస్తారు. దీంతో ఈ కాంబోలో సెకండ్ హ్యాట్రిక్ మొదలవ్వబోతోంది. ఇప్పటికే ఈ ఇద్దరూ ‘సవ్యసాచి’ (Savyasachi), ‘ప్రేమమ్’ (Premam), ‘తండేల్’ సినిమాలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ‘తెనాలి రామకృష్ణ’ సినిమా చేయబోతున్నట్లు నాగ చైతన్య కూడా కన్ఫామ్ చేశారు.
ఈ సినిమా గురించి ఇప్పటివాళ్లకు పెద్దగా తెలియకపోవచ్చు. 1956లో అక్కినేని నాగేశ్వరరావు హీరోగా బీఎస్ రంగా దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. సీహెచ్ వెంకట్రామయ్య రచించిన ‘తెనాలి రామకృష్ణ’ అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఇప్పుడు ఈ సినిమానే నాగ చైతన్య (Naga Chaitanya) – చందు మొండేటి చేయబోతున్నారు. అయితే ఆ కథను యాజ్ ఇట్ ఈజ్ కాకుండా ఇప్పటి తరానికి తగ్గట్టుగా మార్చి తెరకెక్కిస్తారట.
అక్కినేని నటించిన ఈ సినిమాకు ఆ రోజుల్లో జాతీయ పురస్కాలు లభించాయి. నాలుగో జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ఉత్తమ చిత్రం (తెలుగు), ఆల్ ఇండియా సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఈ పురస్కారం అందుకున్న రెండో దక్షిణాది సినిమా ఇది కావడం గమనార్హం. మరి ఇంతటి గొప్ప సినిమాను రీమేక్ చేసే ఆలోచన చేయాలంటే చాలా ధైర్యం కావాలి. మరి చందు మొండేటి ఏం చేస్తారో చూడాలి.