‘ఎవడే సుబ్రహ్మణ్యం’ (Yevade Subramanyam) సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన నాగ్ అశ్విన్ (Nag Ashwin).. మొదటి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత చేసిన ‘మహానటి’ (Mahanati) కూడా బ్లాక్ బస్టర్ కొట్టింది. ఇక ‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD) సినిమా అయితే పాన్ వరల్డ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా తెలుగు సినిమా స్థాయిలో మరింతగా పెంచింది అనే చెప్పాలి. ఇక నాగ్ అశ్విన్ పర్సనల్ లైఫ్ కూడా చాలా మందికి తెలిసిందే.
‘వైజయంతి మూవీస్’ ‘స్వప్న సినిమాస్’ లో కథ ఓకే చేయించుకుని.. దాని చిత్రీకరణ సమయంలో ప్రియాంక దత్ ని (Priyanka Dutt) ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకి రిషి అనే కొడుకు కూడా ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళ లవ్ స్టోరీని సినిమాగా తీస్తున్నట్లు ఇన్సైడ్ టాక్. అవును నాగ్ అశ్విన్ నిర్మాణంలో ‘జాతి రత్నాలు’ (Jathi Ratnalu) సినిమా చేసిన అనుదీప్ (Anudeep Kv) ‘ఫంకీ’ అనే సినిమాని తీస్తున్నాడు. దీని కథ నాగ్ అశ్విన్ బయోపిక్ అని నిర్మాత నాగవంశీ తెలిపాడు.
నాగ వంశీ (Suryadevara Naga Vamsi) మాట్లాడుతూ… “అనుదీప్ అనుకున్నది అనుకున్నట్టు స్క్రీన్ మీద కన్వర్ట్ అయితే మాత్రం.. ఇట్ విల్ బి ఎన్ అనధర్ ‘గీత గోవిందం’. ఇది ప్రాపర్ లవ్ స్టోరీ. గర్ల్ కంట్రోల్డ్ లవ్ స్టోరీ. కానీ ఇది డిఫరెంట్ ఫామ్ ఆఫ్ లవ్ స్టోరీ. ఇది యాక్చువల్లీ ఇంకో రకంగా చెప్పాలంటే దర్శకులు నాగ్ అశ్విన్ గారి బయోపిక్లా అనుకోండి. ఎందుకంటే ఈ సినిమాలో హీరో డైరెక్టరు, హీరోయిన్ ఏమో ప్రొడ్యూసర్ కూతురు. ఇది ఆ సినిమా లైన్ ‘ఫన్ ఫ్యాక్ట్’ అనుకోండి” అంటూ చెప్పుకొచ్చాడు.