తెలుగు సినిమాలయందు నాగవంశీ సినిమాలు వేరయా అంటుంటారు. అంటే ఆయన సినిమాలకు, మిగిలిన సినిమాలకు ఎలాంటి సంబంధం ఉండదు అని కాదు. ఆయన తీసే సినిమాల ప్రచారం, సినిమాలు విడుదలయ్యాక చేసే ప్రచారం చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. వాటికితోడు సినిమాను, సినిమా లెక్కల్ని, సినిమాల ప్రచారాన్ని ఆయన విశ్లేషించినట్లుగా ఇంకెవరూ చేయలేరు అనొచ్చు. ఆయన మాటతీరు, చెప్పే విధానం అలా ఉంటాయి మరి. అలాంటాయన దగ్గర సినిమా ఫలితం గురించి అడిగితే ఎలా చెబుతాడు.. ఇదిగో ఇలా చెబుతాడు.
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కింగ్డమ్’. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫలితం గురించి రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. హిట్ పాట ఉన్న సినిమాలకు ఇటీవల ఓపెనింగ్స్ రావకపోవడం చూశాం. ఏ సినిమా హిట్ అవుతుంది, ఏది కాదు అనేది ఎవరూ నిర్ణయించలేరు. ప్రేక్షకులు ఏ సినిమా చూడాలనుకుంటున్నారు అనే విషయం అడ్వాన్స్ బుకింగ్స్ చూసేవరకూ ఎవరికీ తెలియదు అని ప్రస్తుత ట్రెండ్‌ను వివరించే ప్రయత్నం చేశారు నిర్మాత నాగవంశీ.
ఒక సినిమా ఫలితం తేల్చడానికి రెండు కొలమానాలు ఉన్నాయి. జీఎస్టీ డబ్బులతో బయ్యర్లు బయటపడితే అది హిట్. బయ్యర్‌కు జీఎస్టీ మిగిలితే అది సూపర్ హిట్ సినిమా. ఇక కమిషన్ వస్తే బ్లాక్‌బస్టర్ అని క్లారిటీ ఇచ్చారు నాగవంశీ. తమ ‘కింగ్డమ్’ సినిమా ఇప్పటివరకూ చాలా ప్రాంతాల్లో సూపర్ హిట్ లెక్కల్లో కనిపిస్తోంది. మలయాళంలో మేం ఊహించిన దానికంటే ఎక్కువ వసూళ్లు వస్తున్నాయి. మరో వారంలో ఈ సినిమా వసూళ్లపై క్లారిటీ వస్తుంది అని చెప్పారు.
కొన్ని నెలలుగా నాగవంశీ సినిమా పరిశ్రమ గురించి, పరిశ్రమలో ఇబ్బందులు సృష్టిస్తున్న వారి గురించి మాట్లాడుతున్నారు. అలా ఇటీవల పీఆర్‌వో వ్యవస్థ గురించి చెప్పారు. ఒక్కోసారి వాళ్లు ప్రచారం విషయంలో భయం కలిగిస్తున్నారు అని కామెంట్ చేశారు. దీని మీద పీఆర్‌వోల నుండి పెద్దగా రియాక్షన్ లేకపోవడం గమనార్హం.