పలు కామెడీ షోలకు జడ్జిగా వ్యవహరించడంతో పాటు, నటుడిగా నాగబాబు తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ప్రస్తుతం నాగబాబు కామెడీ స్టార్స్ షోకు జడ్జిగా వ్యవహరిస్తుండగా ఇటీవల విడుదలైన సర్కారు వారి పాట సినిమాలో నాగబాబు చిన్నపాత్రలో కనిపించి మెప్పించారు. అయితే నాగబాబు పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించగా నాగబాబు నిర్మించిన సినిమాలలో కమర్షియల్ గా సక్సెస్ సాధించిన సినిమాలు తక్కువే కావడం గమనార్హం. ఆరెంజ్ సినిమా డిజాస్టర్ కావడంతో సినిమాల నిర్మాణానికి నాగబాబు దాదాపుగా దూరమయ్యారు.
నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా నిర్మాణంలో నాగబాబు భాగస్వామి కాగా ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదనే సంగతి తెలిసిందే. ఆ తర్వాత నుంచి నాగబాబు సినిమాల నిర్మాణానికి దూరంగా ఉన్నారు. అయితే నాగబాబు నిర్మాతగా మళ్లీ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వరుణ్ తేజ్ ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ లో యాక్షన్ థ్రిల్లర్ గా ఒక సినిమా తెరకెక్కనుండగా జులై నెల నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
బీ.వీ.ఎస్.ఎన్.ప్రసాద్, నాగబాబు ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఈ సినిమాలోని ఎక్కువ సన్నివేశాల షూటింగ్ అమెరికాలో జరుగుతుందని తెలుస్తోంది. భారీ బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. నాగబాబు తర్వాత సినిమాలతో నిర్మాతగా సక్సెస్ ట్రాక్ లోకి రావాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ సినిమాతో నాగబాబుకు ఎలాంటి ఫలితం దక్కుతుందో చూడాల్సి ఉంది.
దర్శకునిగా ప్రవీణ్ సత్తారుకు ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు ఉండగా ఆయన డైరెక్షన్ లో తెరకెక్కిన మెజారిటీ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. గుంటూర్ టాకీస్, పిఎస్‌వి గరుడ వేగ సినిమాలు దర్శకునిగా ప్రవీణ్ సత్తారుకు మరింత మంచి పేరును తెచ్చిపెట్టాయి. వరుణ్ తేజ్ ఎఫ్3 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగబాబు నిర్మాతగా రీఎంట్రీ ఇస్తున్నారని వెల్లడించారు.