నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), అక్కినేని నాగార్జున (Nagarjuna). ఈ ఇద్దరూ ఒక స్టేజీని షేర్ చేసుకోవడం కష్టం. ఇప్పటివరకు ఇద్దరూ కలసి ఒకే వేదిక మీద కనిపించింది చాలా తక్కువసార్లు. అలాంటిది ఈ ఇద్దరినీ ఒకే సినిమాలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా ఒకరు విలన్‌గా, మరొకరు హీరో ఫ్రెండ్‌గా. వినడానికి ఆశ్చర్యరంగా, నమ్మకశక్యం కాని విధంగా ఉంది కానీ.. దాదాపుగా ఇది నిజమే అని చెబుతున్నారు. దానికి కారణం ఇద్దరూ ఆ సినిమాకు ఓకే చెప్పారు అని అంటుండటమే.
ఒకప్పుడు టాలీవుడ్‌లో మల్టీస్టారర్‌లు ఆలోచన చేయడమే కష్టమే. ఆ ఆలోచనతో హీరోలను సంప్రదించిన డైరక్టర్‌లు చాలా తక్కువమంది ఉండేవారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. దర్శకులు ఇలాంటి కథలు సిద్ధం చేస్తున్నారు, చేయిస్తున్నారు. హీరోలు కూడా ఇలాంటి పాత్రలకు ముందుకొస్తున్నారు. ఇప్పుడు అలా తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilip Kumar) .. నాగార్జున, బాలకృష్ణను అప్రోచ్ అయ్యారు. అందులో బాలయ్య ఇప్పటికే ఓకే చెప్పేయగా.. నాగ్ రీసెంట్‌గా ఓకే చేశారని టాక్.
రజనీకాంత్ (Rajinikanth) హీరోగా నెల్సా ఇప్పుడు ‘జైలర్ 2’ అనే సినిమా తెరకెక్కిస్తున్నారు. తలైవా కెరీర్‌లో తొలిసారి రూ. 600 కోట్ల బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘జైలర్’ (Jailer) సినిమాకు ఇది సీక్వెల్ అని తెలిసిందే. ఇందులో ఓ కీలక అతిథి పాత్ర కోసం బాలయ్యను సంప్రదిస్తే ఓకే చెప్పారని సమాచారం. నిజానికి ఆయన ‘జైలర్’ సినిమాలో నటించాల్సి ఉన్నా అప్పడు అవ్వలేదు. ఇక ఈ సినిమాలో విలన్‌గా నాగార్జునను సంప్రదించారట నెల్సా. పాత్ర ఆసక్తికరంగా ఉండటంతో ఆయన ఓకే చేశారని చెబుతున్నారు. రజనీకాంత్ ‘కూలీ’ (Coolie) సినిమాలో కూడా నాగ్ నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రజనీకాంత్‌తో వరుసగా రెండో సినిమా అవుతుంది.
పైన చెప్పినట్లు నాగ్‌కి, బాలయ్యకి అంతమంది సంబంధాలు లేవు. ఒకింటి శుభకార్యాలకు ఇంకొరు వెళ్లరు కూడా. ఇలాంటి ఇద్దరూ ఒకే సినిమాలో నటించడం ఆసక్తికరమే. అయితే ఇద్దరినీ కలిపి నెల్సా ఏమన్నా సీన్స్ రాసుకున్నారో లేదో చూడాలి.