కోలీవుడ్ స్టార్ హీరో కార్తి నటించిన లేటెస్ట్ మూవీ ‘సర్దార్’ దీపావళి కానుకగా అక్టోబర్ 21న తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఏక కాలంలో రిలీజ్ కాబోతుంది. ‘అభిమన్యుడు’ ఫేమ్ పి ఎస్ మిత్రన్ ఈ చిత్రానికి దర్శకుడు. ‘ప్రిన్స్ పిక్చర్స్’ బ్యానర్ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ మూవీలో రాశి ఖన్నా , రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించారు. అలాగే ఈ చిత్రం ద్వారా 16 ఏళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇవ్వబోతోంది ఒకప్పటి స్టార్ హీరోయిన్ లైలా.
ఇక ప్రమోషన్లలో భాగంగా ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ వేడుకకు నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన స్పీచ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. నాగార్జున మాట్లాడుతూ… ” ‘ఊపిరి’ సినిమా చేసినప్పటి నుండి కార్తితో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. ‘సర్దార్’ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రెజెంట్ చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. ట్రైలర్ చూసాను.. అదిరిపోయింది. అప్పుడు నేను కార్తికి ఫోన్ చేశాను.
కంగ్రాట్స్ చెబుదామని..!అప్పుడు ఈ సినిమా చేసినందుకు గర్వపడుతున్నానని కార్తి చెప్పాడు. అతను అంత బలంగా చెప్పాడు అంటే కథ పై అతని నమ్మకం ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. కార్తి అన్న సూర్య.. అదే రోలెక్స్(నవ్వుతూ) ఓ సూపర్ స్టార్. అలాంటి సూపర్ స్టార్ నీడ నుండి బయటికి వచ్చి తమకు తాముగా ప్రూవ్ చేసుకోవడం అనేది చాలా అరుదుగా చూస్తుంటాం. అలాంటి వాళ్ళని ఇద్దరినే చూశాను.
ఒకరు మెగాస్టార్ తమ్ముడు పవన్ కళ్యాణ్.. కన్నడలో శివన్న తమ్ముడు పునీత్ రాజ్ కుమార్..! వాళ్ళ తర్వాత చెప్పుకోవాలి అంటే తమిళనాడులో సూర్య తమ్ముడు కార్తినే.! తన సొంత టాలెంట్ తో ప్రేక్షకులను మెప్పించి స్టార్ డమ్ సంపాదించడం మామూలు విషయం కాదు. కార్తి చాలా వైవిధ్యమైన సినిమాలు చేసి సూర్య అంత సూపర్ స్టార్ అయ్యాడు. కార్తి పాటలు కూడా పాడగలడు. ‘ఒకే ఒక జీవితం’ లో ఓ పాట పాడాడు. అన్నిటికీ మించి తెలుగులో మాట్లాడతాడు.
తెలుగులో మాట్లాడేవాళ్ళని మనం వదలం కదా.! ఇక దర్శకుడు మిత్రన్ గురించి చెప్పాలి. ‘అభిమన్యుడు’ ని చాలా బాగా తీశాడు. సర్దార్ ని కూడా గొప్పగా తీసుంటాడని నమ్ముతున్నాను. అక్టోబర్ 21న అందరూ థియేటర్ లో ‘సర్దార్’ చూసి ఎంజాయ్ చేయాలి” అంటూ చెప్పుకొచ్చాడు.