కొబ్బరి కాయ కొట్టకుండానే.. సినిమా షూటింగ్ ప్రారంభం.. ఈ మాట వినడానికి కొత్తగా ఉన్నా ఇలాంటి పరిస్థితిలో కొన్ని సినిమాలు స్టార్ట్ చేస్తున్నారు, చేయబోతున్నారు అని మొన్నీమధ్యే అనుకున్నాం గుర్తుందా? దానికి ఉదాహరణగా పవన్ కల్యాణ్ కొత్త సినిమా ‘వినోదాయ చిత్తాం’ రీమేక్, శర్వానంద్ – శ్రీరామ్ ఆదిత్య సినిమాల గురించి చెప్పుకున్నాం కూడా. ఇప్పుడు ఇదే కోవలోకి మరో సినిమా కూడా వచ్చేస్తోంది. త్వరలోనే ఈ ముహూర్తం కాని ముహూర్తం జరుపుకుంటారు అని టాక్. అన్నట్లు ఈ మూడు సినిమాలు ఒకే నిర్మాణ సంస్థలోనివే కావడం గమనార్హం.
పవన్ కల్యాణ్ – సాయిధరమ్ తేజ్ – సముద్రఖని కాంబినేషన్‌లో ‘వినోదాయ చిత్తాం’ సినిమా రీమేక్ ఇటీవల షూటింగ్ ప్రారంభించుకుంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్ సినిమా కూడా ఇలానే చడీచప్పుడు లేకుండా మొదలైపోయింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఈ సినిమాలు రూపొందుతున్నాయి. అయితే ఎందుకిలా సైలెంట్‌గా మొదలుపెట్టారు అనేది తెలియాల్సి ఉంది. ఈ ప్రశ్నకు సమాధానం తెలియకుండా నాగార్జున – ప్రసన్నకుమార్ సినిమాను కూడా అలానే స్టార్ట్ చేసేస్తారు అని అంటున్నారు.
గతంలో మారుతి – ప్రభాస్ సినిమా కూడా ఇలానే పెద్ద అట్టహాసం లేకుండా మొదలైంది. దీంతో అసలు పీపుల్ మీడియా టీమ్ ఎందుకు హడావుడి లేకుండా సినిమాలు చేస్తుంది అనే డౌట్ అయితే వస్తోంది. అయితే వాళ్లు చేస్తున్న సినిమాలు ఏవీ చిన్న హీరోలవి కావు. ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోల సినిమాలే వారి చేతుల్లో ఉన్నాయి. అలాంటిది అంత పెద్ద హీరోల సినిమాలు ఘనంగా ప్రారంభించాలి కానీ.. ఇలా చెప్పాచేయకుండా కామ్‌గా స్టార్ట్ చేయడం ఏంటో అనుకుంటున్నారు.
అయితే మరికొంతమంది మాత్రం.. అది వాళ్లకు సెంటిమెంట్ ఏమో.. అలా స్టార్ట్ చేస్తే వారికి కలిసొస్తోంది ఏమో అని అంటున్నారు. అయితే దీనిపై పీపుల్స్ మీడియా టీమ్ ఎవరైనా స్పందిస్తే బాగుండు. ఎందుకంటే తమ అభిమాన హీరో సినిమా స్టార్ట్ అవుతోంది అంటే తమ ఇంట్లో ఫంక్షన్‌లాగా భావిస్తారు ఫ్యాన్స్. అలాంటిది ఏదో లాంఛనంగా ప్రారంభిచడం ఏంటో అనే ప్రశ్న వినిపిస్తోంది.