‘ఘోస్ట్’ సినిమా రిలీజ్‌కు ముందే నాగార్జున ‘ఆరు నెలల బ్రేక్ తీసుకుంటాను’ అని ప్రకటించేశాడు. దీంతో సినిమా ఫలితం మీద ఏదో తేడాగా ఉందే అని అనుకున్నారంతా. అనుకున్నట్లుగానే సినిమా రిలీజ్ అయ్యాక ఇబ్బందికర ఫలితాన్ని అందుకుంది. అయితే ఆ తర్వాతి సినిమా ఆరు నెలలకు ప్రారంభం అవుతుందా అనుకుంటే నెర్వస్ 90స్ కారణంగా సినిమా ఇంకా మొదలు కాలేదు. ఇప్పుడు మొదలైంది… అంతేకాదు సంక్రాంతి రిలీజ్ అంటూ డేట్ కూడా ప్రకటించేశారు.
ఇన్ని వాయిదాల తర్వాత ప్రారంభమైన ‘నా సామి రంగ’ సినిమా ఎలా సంక్రాంతికి రెడీ అయిపోతుంది అనే ప్రశ్న గట్టిగానే వినిపిస్తోంది. దర్శకుడి నుండి, హీరోయిన్ వరకు ఏ విషయంలోనూ అంత త్వరగా నిర్ణయం జరగలేదు. ఆ మాటకొస్తే ఇంకా హీరోయిన్ ఎవరు అనే విషయం కూడా తేలలేదు. కానీ నాగార్జున మాత్రం 60 రోజుల్లో సినిమా పూర్తవ్వాలని దర్శకుడు విజయ్ బిన్నికి డెడ్‌లైన్ ఇచ్చారట. అందుకు తగ్గట్టుగానే సినిమా పనులు జరుగుతున్నాయి అంటున్నారు.
అయితే దీనిక ఓ కారణం కూడా ఉంది అంటున్నారు. మలయాళంలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ‘పోరింజు మారియం జోస్’ అనే సినిమా ఆధారంగా ‘నా సామిరంగ’ సినిమా తెరకెక్కిస్తున్నారని టాక్. దీంతో సినిమా 60 రోజుల్లో పూర్తయిపోవడం సులభం అని అంటున్నారు. ఇటీవల షూటింగ్ హైదరాబాద్‌లో మొదలైంది ఆ సందర్భంగా భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించారట. స్టంట్ మాస్టర్ వెంకట్ ఈ సీన్లను డిజైన్ చేశారు.
ఆ షెడ్యూల్ జరిగిన వేగం చూస్తే… అనుకున్న 60 రోజుల డెడ్‌లైన్ చాలా సులభం అని అంటున్నారు. మరి అనుకున్నట్లుగానే ఈ సినిమా ఆటైమ్‌కి అవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అన్నట్లు ఈ సినిమాలో ఓ యువ హీరో ఉన్నాడని టాక్. దీని కోసం తొలుత అల్లరి నరేశ్ పేరు వినిపించినా… ఇప్పుడు రాజ్ తరుణ్ పేరు వినిపిస్తోంది. మరి ఈ విషయం, హీరోయిన్ విషయం ఎప్పుడు తేలుతుందో చూడాలి.