నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. కొద్దిసేపటి క్రితం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకోవడం విశేషం. ఈరోజు రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు పంచెకట్టులో హాజరయ్యి.. అందరినీ ఆశ్చర్యపరిచారు నందమూరి బాలకృష్ణ. గతంలో ఆయన తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కూడా ఢిల్లీలోని పలు కార్యక్రమాలకు ఇలాగే పంచెకట్టుతో హాజరయ్యి తెలుగువారంతా గర్వపడేలా చేశారు.
ఆయన బాటలోనే నందమూరి బాలకృష్ణ పంచెకట్టుతో హాజరైనట్టు అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీలోని మాన్ సింగ్ రోడ్డు మీదుగా బాలయ్య ఫ్యామిలీతో కలిసి రాష్ట్రపతి భవన్ కు హాజరైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. గణతంత్ర దినోత్సవం రోజున పద్మభూషణ్ అవార్డులను కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. హిందూపురం ఎమ్మెల్యేగా ప్రజలకు, బసవతారకం హాస్పిటల్ ద్వారా కేన్సర్ పేషేంట్లకి బాలయ్య చేసిన సేవలను గుర్తించి కేంద్రం ఆయనకు పద్మభూషణ్ అవార్డుని ప్రకటించినట్టు స్పష్టమవుతుంది.
ఇక సినిమాల విషయానికి వస్తే.. ‘అఖండ’ (Akhanda) ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) వంటి హిట్లతో సూపర్ ఫామ్లో ఉన్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ‘అఖండ 2’ (Akhanda 2) షూటింగ్లో బిజీగా గడుపుతున్నారు. తర్వాత గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో కూడా ఆయన ఓ సినిమా చేసే అవకాశం ఉంది. దాని గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఇక బాలకృష్ణ పద్మ అవార్డు అందుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.