విలన్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే హీరో అంత ఎలివేట్ అవుతాడనే విషయం అందరికీ తెలిసిందే. అందుకే తెలుగులో హీరోని ‘కథానాయకుడు’ అని.. విలన్ ని ‘ప్రతినాయకుడు’ అని పిలుస్తారు. అలాంటి విలన్ పాత్రల్లో రాణించడం అందరికీ సాధ్యం కాదు. కళ్లల్లో క్రౌర్యం తాండవించాలి. హావభావాలతో వికటాట్టహాసం చేయాలి. అందుకు తగ్గ భీకర రూపం ఉండాలి. అలాంటి ప్రతినాయక లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్నాయి ‘నీరజ్ యాదవ్’లో. అందుకే.. భోజపురిలో లీడింగ్ విలన్ గా ఇప్పటికే పేరు తెచ్చుకుని, హిందీలోనూ విలన్ గా తనదైన ముద్ర వేస్తున్నాడు.
ఉత్తరప్రదేశ్ ఈయన స్వరాష్ట్రం. అయితే.. తాను ఏ భాషలో నటిస్తున్నా.. అక్కడివాళ్ళు తనను ‘నువ్వు తెలుగువాడివా?’ అని అడుగుతుంటారని.. తన ఫేస్ కట్స్ అలా ఉంటాయని అంటుంటారని.. అందుకే తెలుగులో విలన్ గా మెప్పించాలని ఆశ పడుతున్నానని నీరజ్ యాదవ్ చెబుతున్నారు. ఒక ప్రముఖ దర్శకుడి పిలుపు మేరకు.. ఆడిషన్స్ కోసం హైద్రాబాద్ వచ్చిన నీరజ్ యాదవ్.. నేపాలీ, గుజరాతీ భాషల్లోనూ నటించారు. థ్రిల్లర్ మంజు దర్శకత్వంలో సాయికుమార్, షియాజీ షిండే తదితరులతో రూపొందుతున్న ఓ కన్నడ చిత్రంలోనూ నటిస్తున్న నీరజ్ యాదవ్.. సినిమాలను ప్రేమించే, ప్రతిభను ప్రోత్సహించే తెలుగు ప్రేక్షకులంటే తనకు చాలా గౌరవమని, వాళ్ళ మెప్పు పొంది తెలుగులో ‘మంచి విలన్’గా స్థిరపడాలన్నది తన కోరికని చెబుతున్నారు!!