సినిమా ఇండస్ట్రీలో హీరోలకు, దర్శకులకు సెంటిమెంట్లు ఉంటాయి. ఆ సెంటిమెంట్లలో కొన్ని సెంటిమెంట్లు పాజిటివ్ సెంటిమెంట్లు అయితే మరికొన్ని సెంటిమెంట్లు నెగిటివ్ సెంటిమెంట్లు కావడం గమనార్హం. రాజమౌళి డైరెక్షన్ లో ఏ హీరో నటించినా ఆ హీరో తర్వాత సినిమా ఫ్లాప్ అని ఇండస్ట్రీలో సెంటిమెంట్ ఉంది. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాతో ఈ సెంటిమెంట్ బ్రేక్ అవుతుందని చెప్పినా ఈ సెంటిమెంట్ బ్రేక్ కాలేదు. అయితే ఈ సెంటిమెంట్ చరణ్ విషయంలో మరో విధంగా రిపీట్ అవుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
రామ్ చరణ్ ఇండస్ట్రీ హిట్ సాధిస్తే తర్వాత సినిమా డిజాస్టర్ రిజల్ట్ ను అందుకుంటోందని ఫ్యాన్స్ చెబుతున్నారు. మగధీర సినిమాతో చరణ్ ఖాతాలో తొలి ఇండస్ట్రీ హిట్ చేరిందనే సంగతి తెలిసిందే. అయితే మగధీర తర్వాత చరణ్ నటించి థియేటర్లలో విడుదలైన ఆరెంజ్ సినిమా దారుణమైన ఫలితాన్ని అందుకుంది. ఆరెంజ్ సినిమాకు నాగబాబు నిర్మాత కాగా ఈ సినిమా ఫలితం వల్ల నాగబాబు సినిమాల నిర్మాణానికి దూరమయ్యారు. ఈ సినిమాకు చరణ్ రెమ్యునరేషన్ తీసుకోలేదని గతంలో వార్తలు వచ్చాయి.
ఆ తర్వాత రంగస్థలం సినిమాతో చరణ్ ఖాతాలో మరో ఇండస్ట్రీ హిట్ చేరింది. పెద్దగా అంచనాలు లేకుండా రిలీజైన రంగస్థలం ఊహించని స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం. అయితే రంగస్థలం తర్వాత చరణ్ నటించి విడుదలైన వినయ విధేయ రామ డిజాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో చరణ్ ఖాతాలో మరో ఇండస్ట్రీ హిట్ చేరగా ఆచార్య సినిమాతో చరణ్ ఖాతాలో ఫ్లాప్ చేరింది.
చరణ్ భవిష్యత్తులో ఇండస్ట్రీ హిట్ సాధిస్తే తర్వాత ప్రాజెక్ట్ ల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ఏకంగా 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోంది.