సినిమాకు గ్రాఫిక్స్ అదనపు వాల్యూ ఇవ్వాలి. అలా కాకుండా ఉన్న వాల్యూ తగ్గించింది అనుకోండి లేనిపోని ఇబ్బందులు వస్తాయి. దీనికి లేటెస్ట్ ఉదాహరణ ‘ఆచార్య’. ఆ సినిమాలో చిరంజీవిని యువకుడిలా చూపించడానికి డీఏజింగ్ టెక్నాలజీ వాడారు. దీంతో చిరంజీవి అలా కంప్యూటర్ బొమ్మలా చూడటానికి ఫ్యాన్స్ చాలా ఇబ్బందిపడ్డారు. దీంతో సినిమాను ఇబ్బందిపెట్టేశారు. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు చర్చకు వచ్చింది అనుకుంటున్నారా? అలా టెక్నాలజీ వాడి మరో సినిమాలో హీరోను మార్చారు అనే పుకార్లు రావడమే.
‘సలార్’ సినిమా నుండి కొత్త పోస్టర్ వచ్చింది చూశారా? చూసే ఉంటారు లెండి. చాలా రోజులుగా అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న విషయం కూడా ఆ పోస్టర్‌తో చెప్పేశారు. డిసెంబరు 1న ట్రైలర్ రిలీజ్ చేస్తామని గుడ్ న్యూస్ ఇచ్చారు. ఆ పోస్టర్‌లో ప్రభాస్ చాలా సన్నగా, కుర్ర హీరోలా కనిపించి వావ్ అనిపించాడు. చేతిలో గన్ను, కారు మీద నిలబడి పోజు అబ్బో అదుర్స్ అంతే.
అయితే అందులో ప్రభాస్‌ను చూశాక ఫ్యాన్స్‌కి ‘తేడా కొడతోంది సీనా’ అనిపించకమానదు అంటున్నారు నెటిజన్లు. ఎందుకంటే ఆ పోస్టర్‌లో ప్రభాస్ చాలా సన్నగా కనిపిస్తున్నాడు. ఇంతకుముందు వచ్చిన టీజర్‌లో ఫిట్‌గా కనిపించిన ప్రభాస్ ఇందులో పీలగా ఉన్నాడు. దీంతో ప్రభాస్‌ను గ్రాఫిక్స్ సాయంతో ఇలా సన్నబడేలా చేశారు అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అంతేకాదు ప్రభాస్‌ను ఇటీవల బయట చూసినవాళ్లు కూడా ఇదే మాట అంటారు.
మరి ఎందుకు ఇలా చేసింది టీమ్ అనేది తెలియాల్సి ఉంది అనే కామెంట్లు కూడా కనిపిస్తున్నాయి. మరి దీనిపై టీమ్ ఏమన్నా స్పందిస్తుందేమో చూడాలి. హొంబలే ఫిల్మ్స్ పతాకంపై తెరకెక్కుతున్న ‘సలార్’ రెండు పార్టుల్లో ఇది తొలుతది. ‘సలార్ : ది సీజ్ ఫైర్’ గా వస్తున్న ఈ సినిమాలో శ్రుతి హాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు ఇతర కీకల పాత్రల్లో నటించారు. డిసెంబరు 22న (Salaar) సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.